2023 వన్డే వరల్డ్ కప్ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు విజేతగా నిలుస్తారనే విషయంలో ఒకరికి మించి ఒకరు అంచనాలు వేస్తున్నారు. లెజెండరీ ఆటగాళ్లతోపాటు పలువురు మాజీలు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే 2011 వరల్డ్ కప్ హీరో భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఈ టోర్నమెంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also read :బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన ప్రియాంక.. ప్రాపర్టీలన్నీ అమ్మేస్తుందట?
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’(Player of the Tournament)గా ఎవరు నిలుస్తారనే దానిపై తన మనసులో మాట బయటపెట్టారు. ఈ టోర్నీలో భారత జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్‌తో శుభారంభం అందిస్తున్న రోహిత్ శర్మతోపాటు మిగతా ఆటగాళ్లందరూ రాణిస్తున్నారని చెప్పారు. అలాగే హార్దిక్‌పాండ్య లేనిలోటు ఎక్కడా కనిపించలేదని, రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అందుకునేందుకు ముందంజలో ఉన్నప్పటికీ పేస్ సంచలనం వైపు యువీ మొగ్గు చూపారు. 'భారత్‌కు రిజర్వ్ బెంచ్‌పైనా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్య గాయపడటం వరమని నేను చెప్పను. అయితే అవకాశం వచ్చిన తర్వాత షమీ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. షమీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. గొప్ప ప్రదర్శనతో అదరగొట్టాడు. అందుకే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు అన్ని అర్హతలు కలిగిన వారిలో షమీ ముందుంటాడు. అతడికే వస్తుందని భావిస్తున్నా' అని జోస్యం చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆసియా కప్ ముందు భారత వన్డే టీమ్‌తో ఇప్పటి జట్టును పోల్చి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అప్పుడు సరైన కాంబినేషన్ కోసం ఇబ్బంది పడ్డారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బుమ్రా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. చివరగా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు వరల్డ్ కప్ ను ముద్దాడే అద్భుతమైన అవకాశం వచ్చిందని, వీరిద్దరి కాంబినేషన్‌లో మెగా టోర్నీని గెలిస్తే చూడటానికి చాలా బాగుంటుందని యువరాజ్ సింగ్ తెలిపారు.