Plane crashed in Telangana: భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఉదయం తెలంగాణలో కూలిపోయింది. మెదక్ (Medak) శివారులోని రేవెల వద్ద ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సజీవదహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే దుండిగల్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read: ముంచుకొస్తున్న మిచౌంగ్ ముప్పు.. పలు విమానాలు, రైళ్లు రద్దు
విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని ఐఏఎఫ్(Indian Air Force) తెలిపింది. అందులో ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్‌గా గుర్తించారు. మృతుల్లో ఒకరు అభిమన్యు రాయ్‌గా గుర్తించగా.. మరొకరు వియత్నాంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. సోమవారం ఉదయం దిండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 8.55 గంటలకు కూలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే విమానం దగ్ధమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. పూర్తి కారణాలు ఇంకా తెలియల్సి ఉంది. కాగా, గత 8 నెలల్లో వైమానిక దళానికి ఇది మూడో విమాన ప్రమాదం. జూన్ లో ట్రైనీ విమానం కిరణ్ కూలిపోయింది. మే నెలలో మిగ్-21 విమానం కూలి ముగ్గురు పైలట్లు మరణించారు.