Opinion: మిషన్ ఎడ్యుకేషన్ - తెలంగాణ.. ప్రజాపాలన మార్కుకు నిదర్శనం!

తెలంగాణ విద్య వ్యవస్థలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం ప్రజాపాలన మార్కుకు నిదర్శనమంటున్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య అందాలని కోరుతున్నారు.

New Update
Opinion: మిషన్ ఎడ్యుకేషన్ - తెలంగాణ.. ప్రజాపాలన మార్కుకు నిదర్శనం!

TG Education: 'మానవునిలోని, పిల్లల్లో అత్యున్నతమైన, శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీయడమే విద్య' అంటారు గాంధీజీ. పాలమూరులోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన ఓ సామాన్య వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న మిమ్మల్ని చూసి గర్విస్తూ, ఆనందంతో మీకు నమస్కరిస్తున్నా. రాజకీయాలతో నాకు సంబంధం లేదు కానీ రెండు దశాబ్దాలుగా మీ జీవన ప్రవాహంలో ఎన్నో ఎత్తు పల్లాలు, అవాంతరాలు, విమర్శలు, రాజకీయ వ్యూహాలు, అవమానాలు, వైఫల్యాలను వంటివి తట్టుకోని ఓ సామాన్యుడి స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎదిగిన మీ ప్రయాణం మా అందరికీ ఆసక్తికరం. స్ఫూర్తిదాయకం. తెలంగాణ మన దేశానికి దిక్సూచిగా, మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా వుండాలని అందరిలా కోరుకునే సామాన్య సగటు పౌరున్ని నేను. నెల్సన్ మండేలా అన్నట్లు 'ఈ ప్రపంచాన్ని మార్చగల ఒకే ఒక ఆయుధం విద్య మాత్రమే'. తెలంగాణలో విద్యలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం మీ ప్రజాపాలన మార్కు(మార్పు)కు నిదర్శనం.

విద్యావ్యవస్థలో మార్పులపై కొన్ని ఆలోచనలు..
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఉన్నత చదువులు చదువుకున్న నేను గత రెండు దశాబ్దాలుగా వివిధ ప్రయివేటు విద్యాసంస్థల్లో గణిత ఉపాధ్యాయుడుగా, భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా, అప్పుల తాకిడితో విపరీతమైన ఆర్థిక సమస్యలను చూసిన విద్యాసంస్థల నిర్వాహకుల్లో ఒకడిగా అన్నింటికీ మించి విద్యారంగ ప్రేమికుడిగా నాకు విద్యతో విడదీయరాని సంబంధం, విడదీయలేని అనుబంధం వుంది. ఆరవ తరగతి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జీవిత పాఠాలు, ఐఐటీ, నీట్, టెట్, టిటిసి, పాలి టెక్నిక్, యం.యస్సీ తదితర పోటీ ప్రవేశ పరీక్షలకు పాఠాలు బోధించిన అనుభవంతో నేటి విద్యావ్యవస్థలోని మార్పులపై నేను కొన్ని నా ఆలోచనలను బాధ్యతతో మీకు విన్నవిస్తున్నాను.

ప్రపంచంతో పోటీ..
ఈ రోజు విద్య కొంతమంది స్వార్థం, కొన్ని రాజకీయ కారణాల వల్ల వ్యాపారంగా తన రూపు మార్చుకోవడం ప్రారంభమైంది. ఐఐటీ,నీట్ వంటివి అసామాన్యమైన ప్రతిభ గల గ్రామీణ, తాలుకా స్థాయి పేద విద్యార్థులకు సైతం అందని ద్రాక్ష అయ్యింది. అందుకే పేద ధనిక సామాజిక సాంస్కృతిక సాంఘిక లింగ కుల మతం వంటి తదితర అంతరాలు లేకుండా అందరికీ సమానంగా "అంతర్జాతీయ స్థాయి విద్య"అందాలి. చదువు "కొనడం" పూర్తిగా మాయమై చదువుకునే అవకాశాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ సమానంగా వుండాలి. అంతరిక్ష ప్రయోగాల కాలంలో మనం రాణించాలంటే మీరన్నట్లు ప్రపంచంతో పోటీపడాల్సిందే.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి..
ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్ స్థాయి సిలబస్ లు ఒకదానికోకటి సంబంధం వుండాలి. సబ్జెక్ట్ నిపుణుల సాయంతో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకనుగుణంగా నూతన సిలబస్, బోధనా పద్ధతులును రూపొందించాలి. మనం అక్కడక్కడ వెలుగులోకి వస్తున్న ఫేక్ సర్టిఫికెట్ లు కొనుకునే స్థాయి కాకుండా వంద ఏళ్ళ చరిత్ర గలిగిన మన విశ్వ విద్యాలయాల్లో పి.హెచ్ డి,యం.యస్సీ, బి.యడ్ వంటి తదితర చదువులు చదివి నెట్ ,సెట్,టెట్ వంటి అర్హత పరీక్షల్లో పాసై, విద్యారంగం మరియు బోధన పై ఆసక్తి వుండి కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగం పొందని వారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి విద్యాసంస్థలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అంశాలు, సాంకేతికతకు సంబంధించిన అంశాలు,వాటి అనువర్తనాలతో తరగతి గదిలో బోధన జరగాలి.

మానవ ఉనికినే ప్రశ్నిస్తున్న తరుణంలో..
నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు ప్రపంచం పర్యావరణ కాలుష్యము కాటుకు బలై మానవ ఉనికినే ప్రశ్నిస్తున్న ఈ తరుణంలో ఆచరణత కూడిన "పర్యావరణ విద్య"కు పాఠశాల, కళాశాలలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ వినియోగం,కర్బన ఉద్గారాల వ్యర్థాలు, అడవుల సంరక్షణ వంటి ఎన్నో సవాళ్ళకు మనమంతా పరిష్కారాలు వెతికి విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో ప్రకృతి పచ్చదనానికి ప్రాణం పోయాలి. సైన్స్ ప్రయోగాలను నామమాత్రంగా కాకుండా ఖచ్చితమైన టైం టేబుల్ తో హైస్కూల్, కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించాలి. విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంచుతూ,మనమంతా గర్వించే భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. విద్యారంగంలో కూడా అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి బడ్జెట్ ప్రయివేటు విద్యాసంస్థల్లోని సిబ్బందికి, నిర్వాహకులకి ప్రభుత్వ ప్రత్యేక పథకాలు కేటాయించాలి. కొంత మంది బడ్జెట్ విద్యాసంస్థల నిర్వాహకులు సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల స్కాలర్ షిప్స్ అందక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య లు చేసుకున్నారు. కొందరు ఇప్పటికీ డిప్రెషన్ లో అనారోగ్యం పాలవుతున్నారు. కరోనా విజృంభణ తర్వాత కూడా ఆత్మాభిమానం చంపుకోలేక, వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే స్థాయి లేక టీచింగ్ లోనే వుంటూ సార్/మేడమ్ నమస్కారం అనే పలుకులకే కడుపులు నింపుకొని దేశ భవిష్యత్తును తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మిస్తూ చాలీ చాలని జీతాలతో జీవన పడవను చిరునవ్వులతో నడుపుతున్న ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బందికి సంబంధించి ఉద్యోగ భద్రత, జీతభత్యాలు, హెల్త్ కార్డుల వంటి వాటిపై ఓ చట్టం అమలుచేయాలి. ఎందుకంటే నేటితరం ఉన్నత విద్యావంతులు ప్రయివేటు విద్యారంగంలోకి రావాలంటేనే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది మన రాష్ట్రానికే కాదు మనదేశానికి కూడా చాలా ప్రమాదకరం.

ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం..
శాస్త్రీయతను పెంపొందించేలా నైపుణ్యాలు పెంచేలా విద్యా బోధన జరగాలి. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి. కేజీ నుంచి పిజీ వరకు బోధన, బోధనేతర ఖాళీలను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ సాయంతో భర్తీ చేయాలి. మనందరికీ తెలిసిందే గురువు లేని విద్య గుడ్డి విద్య. బడ్జెట్ లో విద్యకు 15% నిధులు కేటాయించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తూ ఐఐటీ నీట్ ఫౌండేషన్ విద్యను కూడా ఒత్తిడి లేకుండా అందించగలిగితే విద్యను వ్యాపారం చేస్తున్న వ్యవస్థలను మనం నిర్మూలించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, అధ్యాపక పిల్లలు ప్రభుత్వ స్కూల్లో, కళాశాలల్లో చదివిస్తే ఆ తల్లిదండ్రులను గుర్తించి, వారి గురించి ఆదర్శప్రాయంగా మీడియాలో రాస్తున్నారంటే మన ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యావ్యవస్థపై లోతుగా విశ్లేషించాల్సిన అవసరం వుంది. ఆర్థికంగా లేని వాళ్ళే ప్రభుత్వ బడిబాట అనే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి. విద్య మనందరి ప్రాథమిక హక్కు.

శారీరక, మానసిక ధృడత్వం కోసం ఆటలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. మీరు తెలంగాణ క్రీడాకారులను ఒలింపిక్స్ పథకాలు తెచ్చేలా ప్రోత్సాహం అందిస్తామన్న తీరును స్వాగతిస్తున్నాం. దానికి పాఠశాలలే పునాది కావాలి.సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు మీరు అందించిన ఆర్థికసాయం అభినందించదగినది.దానివల్లభవిష్యత్ లో మన రాష్ట్రం నుంచి సివిల్స్ కు పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో పరిశోధనలు పెరిగేలా రిసెర్చ్ స్కాలర్స్ కు కూడా స్కాలర్ షిప్ అందించాలి. రసాయనాల కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇంజనీరింగ్, మెడికల్ విద్యావ్యవస్థలో నూతనత్వం కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి.

సైన్స్, టెక్నాలజీ, సొసైటీ మధ్య అనుసంధానమైన విద్య కావాలి.మన దేశచరిత్ర గురించి, మన శాస్త్రవేత్తల కృషి గురించి, మహానుభావుల ఆశయాల గురించి మానవత, శాస్త్రీయ, నైతిక, జాతీయ, ఆధ్యాత్మిక తదితర విలువల గురించి నేర్పించే వేదికలే మన విద్యానిలయాలు కావాలి. స్వాతంత్ర్యం రాకముందే మన దేశ పౌరసత్వం నుంచి నోబెల్ బహుమతులు పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్,సి.వి. రామన్, ఒలింపిక్స్ లోని హాకీ స్వర్ణ యుగం వంటివి మళ్ళీ చూడాలంటే నోబెల్, ఒలింపిక్స్ పథకాల ప్రకాశం మన దేశం నుంచి ప్రభవించాలంటే మన పిల్లలకు నాణ్యతతో కూడిన, ఆందోళన లేని పరిసరాలతో స్నేహం చేసే శాస్త్రీయ విద్యను అంతర్జాతీయ స్థాయిలో మనం అందించాలి.నిర్భయ,దిశ వంటి భయంకరమైన ఉదంతాల ఛాయలు మరవకముందే కలకత్తాలోని డాక్టర్ సంఘటన జరగడం నాగరిక సమాజంలో అనాగరిక,అమానుష చర్య.దాన్ని మనమంతా తీవ్రంగా ఖండించాం.ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వుండేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిల విద్యతో పాటు భద్రతకు కూడా ప్రత్యేక దృష్టి, ప్రత్యేక చట్టాలు అవసరం. అమ్మాయిల చదువే ఈ అవనికి వెలుగు. దీనిలో మనమంతా బాధ్యతతో కూడిన జీవన విధానం అనుసరించాలి.

పిల్లల కలల భవిష్యత్తును నిజం చేయాలి..
తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(టి.యల్.ఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ కత్తి వెంకటస్వామి నేతృత్వంలో, అధ్యక్షుడు రామకృష్ణయ్య సభాద్యక్షతన పాలమూరు జిల్లా కేంద్రంలో ఆగష్టు 27న విద్యావేత్తలు, మేధావులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు తదితరులతో నిర్వహించిన తెలంగాణ విద్యా సదస్సులో నేను పేపర్ ప్రెజెంటేషన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ జానయ్య కు అందిస్తూ ఈ విషయాలపై ఉపన్యసించాను.ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం లో తీసుకునే మార్పులను ఆహ్వానిస్తూ తమ ప్రోత్సాహపు మద్దతు ప్రకటించింది. ఇలాంటి ఆలోచనలు వివిధ రంగాల ప్రజల నుంచి, వివిధ రకాల విద్యా సదస్సులు,చర్చల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మీరు విభిన్న ఆలోచనల సారాంశాన్ని సేకరించి ఓ మంచి విద్యావిధానం తో మన పిల్లలకు గొప్ప గొప్ప కలల భవిష్యత్తును నిజంచేయాలి. సావిత్రిబాయ్ పూలే, జ్యోతిబాపూలే, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్, అబ్దుల్ కలాం, జయశంకర్ వంటి మహానుభావుల ఆశయాల సౌధాలకు మనమంతా అందరికీ సమాన విద్యావకాశాలతో ప్రత్యేక శోభను అందిద్దాం. వారి వారసత్వాన్ని కొనసాగిద్దామని కోరుతున్నారు అరుణ్ కుమార్.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
M.Sc(OU CAMPUS), AP SET, (Ph.d), B.Ed,TET
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Advertisment
Advertisment
తాజా కథనాలు