Pawan Kalyan: రాష్ట్రంలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించే ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని... వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో ముందుండాలని తెలిపారు.
ఇక, విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని తెలిపారు.ఈ ఘటన దురదృష్టకరమని, మృతి చెందినవారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పవన్ వెల్లడించారు.
గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని అధికారులు తెలియజేశారని పవన్ కల్యాణ్ తెలిపారు.