ఏపీ రాజకీయాలు నిమిషం నిమిషానికి మారుతున్నాయి. జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకున్న తరువాత జనసేన నాయకుల మీద వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపులు పవన్ ని విడిచి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
దీనికి తగినట్లుగానే... కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య కూడా పవన్ కి ఓ బహిరంగ లేఖను రాసి విడుదల చేశారు. ముఖ్యమంత్రి గా చూడాలనుకుంటుంటే..మీరు మాత్రం వేరొకరిని సీఎం చేసేందుకు పాటు పడుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో జనసేన కార్యకర్తల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.
దీంతో దీని గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ ఛైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినిడి తిరుమల రావు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పవన్ భీమవరంలోనే ఉంటారని తెలిపారు. కాపుల్లో ఎలాంటి చీలిక రాలేదని వివరించారు. కాపులంతా జనసేన వైపే ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ ఎలానో..జనసేనకు కాపు సంక్షేమ సేన అలాంటిదని ఆయన వివరించారు.
భీమవరంలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని... దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సున్నా రావడం ఖాయమన్నారు. జనసేన కాపుల పార్టీ అనేది ఒక అపోహ.... బడుగు బలహీన వర్గాల పార్టీ అని వివరించారు. భీమవరంలో సీఎం పర్యటన పేరుతో వందలాది సంవత్సరాల నాటి చెట్లను కొట్టేసి.... బ్యానర్లు కడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు అడుగు జాడల్లో పొత్తు ధర్మం పాటిస్తామని ఆయన వివరించారు.
Also read: తెలంగాణలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు!