AP: వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్.. పిచ్చి..పిచ్చి మాటలు కాదు.. సహాయం చేయండి.!

తాను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని.. అందుకే వెనక్కి తగ్గానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో వైసీపీ నేతలు సహాయం అందించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

New Update
AP: వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్.. పిచ్చి..పిచ్చి మాటలు కాదు.. సహాయం చేయండి.!

Pawan Kalyan Donation: సీఎం చంద్రబాబు రాజకీయ అనుభవం ఈ కష్ట కాలంలో చాలా ఉపయోగపడుతుందని  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను గ్రౌండ్ లోకి వస్తే వరద సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారుల సూచన మేరకు రావడం లేదన్నారు. ఈ విపత్తుకు తాత్కాలిక పరిష్కారం ఏంటనే దానిపై చర్చించామని.. దానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

బుడమేరు 90 శాతం ఆక్రమణలకు గురైందని.. అందుకే విజయవాడ సగాన్ని బుడమేరు ముంచేసిందని అన్నారు. ఈ ఆక్రమణలు ఒక్కసారిగా చేసింది కాదని.. దశాబ్దాల కాలం నుంచి జరుగుతుందని వివరించారు. గత ప్రభుత్వంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి చాలా చోట్ల ముంపు ప్రాంతాల్లో ఇచ్చేశారన్నారు. ఇది రాష్ట్ర సమస్య.. వైసీపీ వాళ్ళు విమర్శించాలనుకుంటే ముందు బాధితులకు సహాయం చేసి మాట్లాడండి అని హెచ్చరించారు. భవిష్యత్ లో బుడమేరు లాంటి వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు చేస్తే డిటెక్ట్ చేసేలా సాంకేతిక పరిజ్ఞానంపై కూడా దృష్టి పెట్టామన్నారు.

Also Read: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏంటి? ఎలా డొనేట్‌ చేయాలి?

ఈ వరదల వల్ల దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇద్దరు గల్లంతు అయ్యారని తెలిపారు. వేలాదిగా పశువులు కూడా చనిపోయాయని.. వాటి కోసం హెల్త్ క్యాంప్ కూడా పెట్టామని తెలిపారు. చాలా వరకూ రోడ్లు పోయాయని, లక్షలాది పంట భూములు కూడా పోయాయన్నారు. ఈ వరదల వల్ల ఉన్న ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లా బాగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు 4,146 కాల్స్ వచ్చాయని తెలిపారు.

పంచాయతీ రాజ్ నుంచి 175 టీమ్స్ ను విజయవాడ అర్బన్ కు పంపించామని.. అలాగే మిగిలిన ప్రాంతాలకు 685 టీమ్స్ ను పంపించామన్నారు. వరద తగ్గిన తరవాత క్లోరినేషన్, సూపర్ క్లోరినేషన్ కు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో బాగా పని చేస్తున్న శానిటరీ వర్కర్స్ ను గౌరవించే కార్యక్రమం చేస్తామని తెలిపారు. పంచాయతీ శాఖలో పని చేసే లక్షా 64 వేల మంది ఉద్యోగులు, అలాగే పీఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై అసోసియేషన్స్ నుంచి కలిపి వారి నెల జీతాన్ని వరద బాధితులకు సహాయం చేశారని తెలిపారు. ఇది మొత్తం సీఎం సహాయ నిధికి అందజేస్తామని.. వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.

అలాగే తనవంతు సహాయంగా వ్యక్తిగతంగా ముందు ప్రకటించిన కోటి రూపాయలు కాకుండా బాధిత 400 పంచాయతీలకుగానూ ఒక్కో పంచాయతీకీ వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు అందజేస్తానన్నారు. అలాగే తెలంగాణ వరదలకు కూడా కోటి రూపాయలు సహాయం చేస్తానని తెలిపారు. ఆ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి స్వయంగా అందజేస్తానన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నాయకులు పిచ్చి మాటలు కాకుండా వారు కూడా బాధితులకు సాయం చేయాలని సూచించారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో చూస్తున్నామని.. వారి నుంచి తాము కూడా నేర్చుకుంటున్నామన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో తీసుకువస్తే మంచిదేనని.. కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అన్నారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు