Pithapuram: పవన్ పిఠాపురం వాస్తవ్యుడు కాదని గత ప్రభుత్వ నాయకులు అన్నారు. కానీ ఈరోజు నేను 3 ఎకరాల భూమి కొని పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురం ఉప్పాడ ప్రాంతంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఆంధ్రలో ఉండడు. హైదరాబాద్‌లో ఉంటాడని అన్నారు. కానీ నేను ఇకపై పిఠాపురం ప్రజల్లోనే ఉంటానని హామీ ఇచ్చారు.
వర్మ చెప్పిన మాటలు నిజమయ్యాయి..
అలాగే గత పాలకులు తనను అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. గేటును బద్దలుగొట్టుకుని అసెంబ్లీలో అడుగుపెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని చెప్పారు. ‘పవన్ అసెంబ్లీ గేటు కూడా తాక నీయమన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి బద్దలుగొట్టుకుని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అని చెప్పారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు. నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పా. వచ్చిన ఆదాయంతో ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు మీ డబ్బు కాబట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నా. బాధ్యతగా ఉండాలనే మా శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నాం. లంచాలు తీసుకోను, మీ అభ్యున్నతికి పాటుపడతా, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాని అన్నారు. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిని కాబట్టి నాకు వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులను గౌరవిస్తూనే పనులు చేయించుకోవాలని సూచించారు.
పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి..
ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏం చెప్పాలని ఎంపీ ఉదయ్ అడిగారు. ఆయనకు మనం బలం అవ్వాలి కానీ, బరువు కాకూడదని చెప్పాను. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజం అభివృద్ధి చేస్తాం. అందమైన కోస్టల్ రోడ్డును నిర్మిస్తాం. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తాం. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తాం. కోటగుమ్మం గేట్ వద్ద రైల్వే పైవంతెన కావాలని కేంద్రాన్ని కోరాం. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఢిల్లీలో మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను, చంద్రబాబు ఆలోచిస్తున్నామని పవన్ చెప్పారు.
షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి..
అలాగే తనను OG, OG అంటూ ఫ్యాన్స్ అరవడంతో.. నవ్వూతూ స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించానని, ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షేడ్యూల్ తయారు చేసుకొవాలని చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. త్వరలో రిలీజ్ కాబోతున్న OG సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని చెప్పారు.