పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అప్డేట్ వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 22 వరకు మొత్తం 19 రోజుల పాటు 15 సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) వెల్లడించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి. ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరగనున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్‌లో ప్రారంభమవుతాయి, అయితే ఎన్నికల కారణంగా ఈసారి డిసెంబర్‌కు వాయిదా పడ్డాయి.
ALSO READ: రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కేటీఆర్ సంచలన ప్రకటన!
ఈ సమావేశాల్లో ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా ఈ సెషన్‌లోనే రావచ్చు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. వీటితోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు కూడా పార్లమెంటులోనే పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసనల మధ్య ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాలేదు.