మణిపూర్ అంశంపై సోమవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో సభ దీనిపై చర్చిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ హామీ ఇవ్వగా.. ముందు మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. వారి నినాదాలతో ఉభయ సభలూ హోరెత్తాయి. మణిపూర్ అంశంపై చర్చకు 68 మంది ఎంపీలు నోటీసులు ఇచ్చారని, కానీ ప్రభుత్వం దీనిపై సమగ్ర చర్చ జరపకుండా తప్పించుకుంటున్నదని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవలసిందిగా చైర్మన్ జగదీప్ ధన్ కర్ చేసిన సూచనను విపక్షాలు పట్టించుకోకుండా నినాదాలు కొనసాగించాయి.
మొదట రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. అయితే తిరిగి సమావేశమైన తరువాత కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో చైర్మన్ మధ్యాహ్నం మూడున్నర గంటలవరకు వాయిదా వేశారు. కానీ తిరిగి విపక్షాల రభసతో మంగళవారానికి వాయిదా వేశారు. కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు-2023 ను ప్రతిపాదించారు. 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును రాజ్యసభ ఇదివరకే ఆమోదించింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తున్నప్పటికీ ఈ గందరగోళంలోనే అనురాగ్ ఠాకూర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ముఖ్యమైన ఈ బిల్లుపై చర్చ జరగవలసి ఉందన్నారు.
మీవన్నీ మొసలి కన్నీళ్లు.. నిర్మలా సీతారామన్
వీరి ప్రవర్తన హుందాగా లేదని, మణిపూర్ పరిస్థితిపై చర్చకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ వీరు సభ నుంచి పారిపోతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఈ ఎంపీల వ్యవహారంపై తానెంతో చింతిస్తున్నానన్నారు. మీరు ధరించిన (నల్ల) దుస్తులే మీ మైండ్ సెట్ ని నిరూపిస్తున్నాయని, మణిపూర్ పై చర్చ విషయంలో నిజానికి మీకు శ్రద్ధ లేదని ఆమె అన్నారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించిన ఆమె.. మీవన్నీ మొసలి కన్నీళ్ళని తీవ్రంగా మండిపడ్డారు. ఇక మణిపూర్ వెళ్లి వచ్చిన మా ప్రతినిధి బృందంలోని సభ్యుల అభిప్రాయాలను ఉభయ సభలూ వినాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. 267 నిబంధన కింద మొదట మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలన్నారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆయనతో ఏకీభవిస్తూ.. అతి ముఖ్యమైన అంశంపై సభలో ప్రకటన చేయడానికి ప్రధాని ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. కానీ 176 రూల్ కింద దీనిపై స్వల్పకాలిక చర్చకు అనుమతిస్తున్నానని జగదీప్ ధన్ కర్ చేసిన ప్రకటనను విపక్ష ఎంపీలు తప్పు పడుతూ .. తమ నినాదాలను కొనసాగించడంతో ఆయన సభను మంగళవారానికి వాయిదా వేశారు.