BCCI - Shami: టీమ్ఇండియా పేస్ కెరటం మహ్మద్ షమీని దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు వరించబోతోందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే అది త్వరలోనే నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇందుకోసం బీసీసీఐ షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ లో పెను సంచలనాలు నమోదు చేసిన షమీ తన అద్భుత బౌలింగ్‌తో అందరినీ కట్టిపడేశాడు. హార్దిక్ పాండ్య గాయంతో ప్రపంచకప్ కు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
ఇది కూడా చదవండి: ‘అదంతా పిచ్చి వాగుడు..’ ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన మహ్మద్ షమీ!
అర్జున అవార్డు విషయంలో మొదట పంపిన జాబితాకు అదనంగా షమీ పేరుతో క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన పంపినట్లు సమాచారం. షమీతో పాటు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను కూడా సిఫారసు చేశారు.
ఇప్పటి వరకూ ఎవరెవరికి ఈ అవార్డు వచ్చింది?
2021లో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (2013), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), రవీంద్ర జడేజా (2019) కూడా గతంలో అర్జున అవార్డు గెలుచుకున్నారు.