Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. దేశంలో పేదరికం అనేది లేకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల 10 కిలోల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నెల రూ.8500 అందిస్తామన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్ములించడమే తమ ఎజెండా అని అన్నారు.
ALSO READ: 272 కంటే తక్కువ సీట్లు వస్తే ఎలా?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
యూపీఏ ప్రభుత్వ హయాంలో 'ఆహార భద్రత చట్టం' ద్వారా ఆహార హక్కుకు చట్టపరమైన హోదా కల్పించామని అన్నారు. ఈ సారి నుండి పేదలకు 5 కిలోకాకుండా 10 కిలోల బియ్యం అందిస్తామని అన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల 10 కిలోల రేషన్, అర్హులైన వారికి నెలకు రూ. 8500 ఇవ్వడం, ఉచిత విద్య, వైద్యం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటివి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. లక్షలాది కుటుంబాలు పేదరికం నుండి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పెంచుతుందని అన్నారు.
నరేంద్ర మోదీ 20-25 మంది బిలియనీర్లను తయారు చేసి 'అదానీ' ప్రభుత్వాన్ని నడిపారని ఫైర్ అయ్యారు. కోట్లాది మంది లక్షాధిపతులను తయారు చేసి 'భారతీయుల' ప్రభుత్వాన్ని నడుపుతాం అని పేర్కొన్నారు.