T20 WC Hero Saurabh Netravalkar : టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) లో అగ్రరాజ్యం అమెరికా (America) ను సూపర్ 8కు చేర్చడంలో ముఖ్య పాత్ర వహించిన ప్రవాస భారతీయుడు సౌరభ్ నేత్రావల్కర్ (Saurabh Netravalkar) గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతుంది. ఈ ఐటీ ఇంజినీర్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. పాకిస్తాన్ పై అద్బుత సూపర్ ఓవర్ వేసి అమెరికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో నేతా్రవల్కర్ కీలక పాత్ర పోషించాడు.
ఆ తరువాత మ్యాచ్ లో టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్ పేరు ఒక్కసారిగా మారు మోగింది. నేత్రావల్కర్ అమెరికాలోని ఒరాకిల్ ఏఐ ఇంజినీర్ గా చేస్తున్నాడు. అతడి ఆటతీరును ప్రశంసిస్తూ ఒరాకిల్ సంస్థ ట్వీట్ చేసింది. టీ 20 ప్రపంచ కప్ లో అమెరికా చరిత్ర సృష్టిస్తోంది. నేత్రావల్కర్ ఆటతీరు పట్ల ఎంతో గర్వంగా ఉంది అంటూ ఎక్స్ లో పోస్టు చేసింది.
దీంతో నా టెక్ కెరీర్ తో పాటు క్రికెట్ అభిరుచిని కూడా కొనసాగించేందుకు మద్దతునిచ్చిన ఒరాకిల్ కు ప్రత్యేక కృతజ్ఙతలు అంటూ సౌరభ్ కూడా వెంటనే స్పందించాడు. దీనిని నెట్టింట చూసిన పలువురు నెటిజన్లు, టెకీలు అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ఒరాకిల్ సంస్థకు పలు విజ్ఙప్తులు చేస్తున్నారు.
అతడితో వర్క్ ఫ్రం హోం చేయించకూడదని, సెలవులు పొడిగించి..జీతాన్ని 60 శాతం పెంచాలని, అంతేకాకుండా అతడికి అన్ని డెడ్ లైన్ల నుంచి విముక్తిని కల్పించాలని క్రికెట్ పైనే పూర్తి దృష్టిపెట్టేలా చేయాలని కంపెనీని చాలా మంది కోరారు. మైదానంలో అదరగొట్టే సౌరభ్...మ్యాచ్ అవ్వగానే హోటల్ గదిలోకి వెళ్లి తన ఉద్యోగాన్ని కూడా చేసుకుంటాడని సౌరభ్ సోదరి వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి సెలవుల గురించి విజ్ఙప్తులు వెల్లువెత్తుతున్నాయి.
Also read: తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్!