ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి..'ఇండియా' నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మోడీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఈ కూటమి..ఈమేరకు బుధవారం నోటీసును అందజేయాలని తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమకు 24 గంటల సమయం ఇవ్వాలని కోరింది.
లోక్ సభలో బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకు మెజారిటీ ఉన్నప్పటికీ.. మణిపూర్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటాన బెట్టేందుకు తమ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నామని ఆ నేత చెప్పారు. అవిశ్వాస తీర్మాన యోచనపై మరిన్ని చర్చలు జరపాలని ఒక దశలో భావించామన్నారు. ,, ఒకవేళ పార్లమెంటులో ఈ తీర్మానం వీగిపోయిన పక్షంలో అది ప్రభుత్వానికే 'పాజిటివ్ సీన్' గా మారే ఛాన్స్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏమైనప్పటికీ లోక్ సభలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే విషయంలో విపక్షాలు ఒకే తాటిపై ఉన్నాయని తెలుస్తోంది.
మంగళవారం ఉదయం ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన ప్రతిపక్షనేతలు దీనిపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మణిపూర్ అంశంపై విపక్షాలు ఇప్పటికే పార్లమెంటులో ఉభయసభలనూ స్తంభింపజేశాయి. ఈ సమస్యపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ .. మొదట ప్రధాని మోడీ దీనిపై ఓ ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను ఈ పార్టీలు వదులుకోలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 20 నుంచే మణిపూర్ అంశం ఉభయసభలనూ అట్టుడికించింది.
విపక్ష సభ్యుల రభసతో సభలు పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చాయి. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరాయి . పార్లమెంట్ సమావేశాల నాలుగో రోజైన మంగళవారం కూడా విపక్ష కూటమి ఎంపీల గందరగోళంతో మొదట కొద్దిసేపు వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో ఆయన ఛాంబర్ లో సమావేశమైన తరువాత కూడా ప్రతిపక్ష నేతలు .. తమ తమ డిమాండును పునరుద్ఘాటించారు. కేంద్రంపై అవిశ్వాసం తేవాలంటే 50 మంది ఎంపీలు అవసరమవుతారు. దీని 'ఔట్ లైన్' ని రూపొందించేందుకు, ఎంపీల సంతకాలను సేకరించేందుకు సంబంధించిన బాధ్యతను లోక్ సభలో కాంగ్రెస్ నేతలైన అధిర్ రంజన్ చౌదరికి, మనీష్ తివారీకి అప్పజెప్పారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని కోరుతూ విపక్ష నేతలు సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు.