మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రంతా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారు. ప్రతిపక్ష కూటమి..'ఇండియా' లోని కాంగ్రెస్, ఆప్, టీఎంసీ తదితర పార్టీల సభ్యులు గాంధీజీ విగ్రహం వద్ద నిరసనకు కూర్చున్నారు. మూడు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయని, అతి ముఖ్యమైన మణిపూర్ అంశంపై చర్చ జరగనే లేదని, దీనిపై తాము వాయిదా తీర్మాన నోటీసులు కూడా అందజేశామని వారు పేర్కొన్నారు.
'ఇండియా ఫర్ మణిపూర్' అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని వారు గంటలపాటు ధర్నా చేశారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ని మిగతా సభా కాలానికి గాను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా కూడా ఇది జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. మణిపూర్ పరిస్థితిపై మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పయిందా అని గోఖలే అన్నారు.
ఈ నెల 20 న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు నుంచే మణిపూర్ అంశం ఉభయసభలనూ వేడెక్కించింది. మోడీ దీనిపై సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతూ వచ్చాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశాయి.
తామిచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ కర్ పట్టించుకోనందుకు ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసి రభసకు దిగడంతో ఉభయ సభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇక పార్లమెంట్ బయట తన నిరసన కొనసాగుతుందని టీఎంసీ సభ్యుడు సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. నా సస్పెన్షన్ ని ఎత్తివేసేవరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగుతుందన్నారు.ఆయనకు సంఘీభావంగా సోమవారం రాత్రి కాంగ్రెస్ ఎంపీలు సయ్యద్ నసీర్ హుసేన్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, శివసేన (ఉద్ధవ్) నేత ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ సుష్మితా దేబ్ ప్రభృతులు నిరసనలో పాల్గొన్నారు.