సందిగ్ధంలో గ్రూప్ 1.. కేసుల మీద కేసులు -తప్పుల మీద తప్పులు!

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని డా.కిరణ్‌ దాసరి అంటున్నారు. గ్రూప్ 1తో మొదలుపెడితే EWS రిజర్వేషన్లు, ఖాళీల సంఖ్య వంటి విషయాల్లో తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలంటున్నారు. 

TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!
New Update

TG JOBS: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు కలల స్వప్నం గ్రూప్ 1. నీళ్లు, నిధులు, యామకాలు పేరుతో జరిగిన మలిదశ పోరాటంలో నిరుద్యోగుల పాలిట ఆశాదీపం అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక గ్రూప్ 1 నోటిఫికేషన్ లక్షలాది నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 మొదలైన గ్రూప్ 1 నియామక ప్రక్రియ ఎన్నో అడ్డంకులను తొలగించుకుంటూ మొత్తానికి 2017-18 లో ముగిసింది. సాధించిన తెలంగాణలో మొదటి గ్రూప్ 1 నియామకాలు 2022 లో మొదలైతే అది కాస్త ఎన్నో అనుమానాలు, మరెన్నో అవాంతరాలతో రద్దయి, కొత్త ప్రకటన కూడా వచ్చింది. అది కూడా ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొత్తానికి హైకోర్టు  15 అక్టోబర్‌2024 రోజు రెండు కేసులను కొట్టి వేసి మెయిన్స్ పరీక్ష అనుకున్న విధంగా జరిపించాలని ఆదేశించింది. ఈ తరుణంలో అభ్యర్థుల మెదళ్లలో మెదులుతున్న ఎన్నో అనుమానాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నమే ఇది. 

అసలు పరీక్ష సక్రమంగా జరుగుతుందా..

2022 గ్రూప్ 1 ప్రకటన రద్దుతో మొదలుకొని EWS రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ఖాళీల సంఖ్య, తప్పుడు సమాధానాలు తదితరాల మీద ఉన్న 30కి పైగా న్యాయపరమైన కేసులతో అసలు పరీక్ష సక్రమంగా జరుగుతుందా అనే అనుమానమే అందరి మెదళ్లను కదిలిస్తూవచ్చింది. ఇప్పటికైతే ఒక స్పష్టత వచ్చింది. గ్రూప్ 1 విషయంలో కొంత మేరకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒక గ్రూప్ 1 అభ్యర్థుల్లో కొందరు నిరుద్యోగులు అయితే, ఇంకొందరు ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతున్న వాళ్ళు. ముల్టీపుల్ రీజన్స్, తప్పుడు జవాబులు లాంటి కేసులలో కోర్టు నిర్ణయం ఒక కొలిక్కి వచ్చినా, జీవో 29 విషయంలో ఇవ్వాళా వాదనలు పూర్తి కావాల్సి ఉన్నా కాలేదు. కావున రేపటికి వాయిదా పడింది. ఇప్పుడు మన అందరి మేళ్ళల్లో మెదులుతున్న ప్రశ్న తెలుగు అకాడమీ పుస్తకాలకు ఉన్న ప్రామాణికత ఎంత? అసలు వాటిని చదవాలా వద్దా? మరి ఇన్నేళ్ళుగా ప్రామాణికంగా తీసుకొని జరిపిన పరీక్షల విలువ ఎంత?

తప్పుల తడకగా ప్రిలిమ్స్ కీ


జూన్ 9 2024న జరిగిన గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను జులై 7న విడుదల చేసింది. దాదాపు 14 ప్రశ్నలకు జవాబులను తప్పుగా చూపించారంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకి వెళ్లగా జరిగిన వాద ప్రతివాదనలు టీఎస్పీఎస్సీ ద్వంద్వ వైఖరి కనిపించింది. టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాదులు చూపించిన కొన్ని కారణాల మూలంగా అభ్యర్థులు "బెనిఫిట్ అఫ్ డౌట్" కింద 7 ప్రశ్నలను వెనక్కి తీసుకొని అవే కారణాలు చూపిస్తూ మిగతా 7 ప్రశ్నల మీద వాదిస్తున్నారు. టీఎస్పీఎస్సీ వాదనల ప్రకారం ఏవైనా 7 ప్రశ్నలను అంగీకరించాలి. కానీ అది జరగలేదు. ఒక వేల అభ్యర్థులు కోరినట్లు ఆ ప్రశ్నలను తొలగిస్తే, ప్రస్తుత ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలుంటాయి. కొత్తగా కొందరికి అర్హత అవకాశం వచ్చి మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చేది.  కానీ ప్రస్తుతం అలా జరగలేదు. హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. పూర్తి వివరాలింకా తెలియలేదు. కానీ తప్పులను కూడా ఒప్పులుగా చూపించే ప్రయత్నంగా ఈ ప్రయత్నం జరిగినట్లుగా అనుమానం వస్తోంది. దీనికి బదులు ఈ సమస్య పరిష్కారం కోసం కోర్టు దిగివచ్చి ఎక్స్పర్ట్ కమిటీ వేసి అభ్యర్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ అది జరగలేదు. కారణాలేమైనా కానీ తీసుకున్న నిర్ణయం న్యాయపరమైనదిగా కనిపించడం లేదు.

తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదా? 


టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోటీ పరీక్షకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే తెలుగు అకాడమీ పుస్తకాలను తెలుగు మీడియం విద్యార్థులకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆ పుస్తకాలను ఆయా అంశాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో అన్ని సందర్భాలకు ఉపయోగపడేలా తయారు చేసినవి. తెలుగు మీడియంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా ఇవే ప్రామాణికం. ఇలాంటి పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలలో సమాచారాన్ని చూపిస్తూ అవే నిజమంటూ తెలుగు మీడియం విద్యార్థులను అయోమయానికి గురి చేస్తుంది టీఎస్పీఎస్సీ. 

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలను సైతం ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రెండింటిని కాదని ఇప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష లోని కొన్ని ప్రశ్నలకు ఇంగ్లీష్ పుస్తకాల ఆధారంగా సమాధానాలను హైకోర్టులో చూపించడం చాలా విడ్డూరం. తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఎందుకు చదువుతారు. ఈ మాత్రం అవగాహన లేదా అని అభ్యర్థులు అడుగుతున్నారు. 

గతంలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ లెక్చరర్ లాంటి పోటీ పరీక్షల్లో తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా చూపిస్తూ దాదాపు 20 కి పైగా ప్రశ్నలను తొలగించడం జరిగింది. అలాంటప్పుడు గ్రూప్ 1 పరీక్షకు ప్రామాణికం కానీ తెలుగు అకాడమీ పుస్తకాలు మిగతా పరీక్షలకు ఎలా ప్రామాణికం అవుతాయని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పని చేసే తెలుగు అకాడమీని ప్రామాణికం కాదనడం చాలా తప్పు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య మంత్రి దగ్గరే ఉండడంతో టీఎస్పీఎస్సీ చేస్తున్న వాదన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. 

2022 లో ప్రకటించిన గ్రూప్ 1 పరీక్ష ను అసలు రద్దు చేయవచ్చా?
ఇది చాలా తక్కువ మంది మదిలో మెదిలే ప్రశ్న . ఒక్కసారి 2022 లో వచ్చిన గ్రూప్ 1 ప్రకటన లో "... Commission also reserves its right to .. withdraw the Notification at any time,.." అని ఉంటే, 2024 లో వచ్చిన గ్రూప్ 1 ప్రకటనలో "... Commission also reserves its right to .. withdraw/cancel the Notification at any time,..." అని ఉంది. cancel, withdraw అనే పాదాల మధ్య తేడా కూడా ప్రస్తుతం ఒక వివాదాంశం అయ్యింది. దీనిమీద కూడా న్యాయపరమైన వాదోపవాదనలు హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయిలో జరిగినట్టు అభ్యర్థులు చెప్తున్నారు. అయితే 2022 గ్రూప్ 1 ప్రకటనను ఎలాంటి సాంకేతిక కారణాలు చూపెట్టకుండా రద్దు చేయడం పలు న్యాయపరమైన చిక్కులకు తావిస్తోంది. ఇది కూడా ప్రస్తుత సందిగ్ధానికి ఒక ప్రధాన కారణం. దీనిని కూడా అభ్యర్థులు గట్టిగానే వినిపిస్తున్నారు. 

"మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 2022 గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనను రద్దు చేస్తున్నాం" అంటూ రద్దు చేశారు. అంతకు మించి ఎలాంటి కారణాలను టీఎస్పీఎస్సీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రద్దు ప్రకటనలో ప్రస్తావించలేదు. ప్రభుత్వ సూచన మేరకు గ్రూప్ 1 ప్రకటనను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మరి ఎవరి సూచన మేరకు అదే 2022 గ్రూప్ 1 ప్రకటనను రద్దు చేసిందో చెప్పాలని అభ్యర్థులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే జూన్ 2023 లో జరిగిన రెండవ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సరిగ్గా లేదన్న కారణంతో హైకోర్టు రద్దు చేయాలంటూ తీర్పు ఇవ్వడం ఒక కారణం కావొచ్చు కానీ దానిని రద్దు ప్రకటనలో ప్రస్తావించకపోవడం టీఎస్పీఎస్సీ చేసిన ఒక తప్పుగా న్యాయకోవిదులు భావిస్తున్నారు. 

2022 లో విడుదలైన గ్రూప్ 1 ప్రకటనకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 2022 లో జరగగా, పేపర్ లీకు పేరుతో ఆ పరీక్షను ఫిబ్రవరి 2023 లో రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 2023 లో మళ్ళీ నిర్వహించారు. నిర్వహణ సరిగా లేదన్న కారణంగా హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్త ప్రకటనను విడుదల చేశారు. కొత్త ప్రకటనలో పాత 503 ఖాళీలకు కొత్తగా ఇంకో 60 జతచేసి మొత్తం 563 ఖాళీలకు ప్రకటన విడుదల చేసి కొత్త ఖాళీలకు పాత ఖాళీలకు విడివిడిగా ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళిక గాని నియమావళిని కానీ ఇవ్వకపోవడంతో అభ్యర్థులందరిలో మరింత గందరగోళం మొదలైంది. ఇక్కడే టీఎస్పీఎస్సీ తప్పుదారి పట్టిస్తున్న ట్లు న్యాయ వేత్తలు చెప్తున్నారు. 

జీవో 29 నిలిచేనా?
ఈ గ్రూప్ 1 ప్రకటనకు సంబంధించిన అత్యంత బలమైన కేసులలో ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 2022 గ్రూప్ 1 ప్రకటనను రద్దు చేసి కొత్త గ్రూప్ 1 ప్రకటనను విడుదల చేసే సమయంలో జీవో 29 ను ఫిబ్రవరి 2024 లో తీసుకు వచ్చింది. బాలాజీ భడవత్ వర్సెస్ ఏపీపీఎస్సీ కేసులో ఎప్పుడో 2009 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇదివరకున్న జీవో 55 ను సవరిస్తూ తీసుకువచ్చిన జీవో 29 మీద నడుస్తున్న కేసు తుది తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉంది. అది పూర్తిగా టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చే అవకాశమే ఉంది. రిజర్వుడ్ అభ్యర్థులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు అయిన 14(4), 16(4) మరియు 335 లకు విరుద్ధంగా తీసుకు వచ్చినది ఈ జీవో. 

ఈ ఏడాది మే నెలలో దీపేంద్ర యాదవ్ వర్సెస్ మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకం కాబోతోంది. ఆ తీర్పు ప్రకారం రిజర్వుడ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎవరైనా ఓపెన్ కేటగిరీ లో ఎన్నికైతే వారిని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు గానే పరిగణించాలి కానీ రిజర్వుడ్ కేటగిరీ కింద పరిగణించరాదు అని స్పష్టంగా చెప్పింది. దీనితో పాటు ఈ నియమాన్ని ప్రతి దశలో అనగా ప్రిలిమ్స్, మెయిన్స్ తదితర దశల్లో ప్రత్యేకంగా అనుకరించాలని కూడా చెప్పింది. 

ఇందుకు విరుద్ధంగా పని చేసేదే ప్రస్తుత జీవో 29. కావున జీవో 29 కి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కిన అభ్యర్థుల చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రంగా పని చేస్తోంది. దీంతో హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పును కాదనలేని పరిస్థితి ప్రస్తుతం ఉండడంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో టీఎస్పీఎస్సీ నెట్టివేయబడింది. ఒకవేళ హైకోర్టు లో ఏమైనా తేడా వస్తే అభ్యర్థులు వెంటనే సుప్రీంకోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు కూడా తయారవుతున్నారు.

జీవో 29 ప్రకారం, ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. వారికి ఉన్న రిజర్వేషన్ మాత్రమే దక్కుతుంది అంటే మిగతా రిజర్వేషన్ 50% పోస్టులు 10% కూడా లేని ఉన్నత కులాల వారికి చెందుతాయి. 2022 లో వెలువడిన గ్రూప్ 1 కి జీవో 55 ను పాటిస్తామని పలు సందర్భాలలో చెప్పిన టీఎస్పీఎస్సీ 2024 లో జీవో 55 లో సవరణలు చేస్తూ జీవో 29 ను తీసుకువచ్చి దాని ప్రకారం గా నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అందరిని ఆగ్రహానికి గురిచేసింది.

*టీఎస్పీఎస్సీ కి లీగల్ సెల్ లేదా? *
ప్రస్తుత గ్రూప్ 1 ప్రకటన మీద దాదాపు 30 కి పైగా కోర్టు కేసులు నడుస్తుండడం ప్రస్తుత టీఎస్పీఎస్సీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఎన్నో భారీ నియామకాలు ఎలాంటి కేసులు లేకుండా ఘంటా చక్రపాణి నాయకత్వంలో చేపట్టిన టీఎస్పీఎస్సీ ఇదేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎన్నో కొత్త సంస్కరణలు చేపట్టి ఎంతో దిగ్విజయంగా నడిచిన టీఎస్పీఎస్సీ ప్రస్తుతం పలు అనుమానాలతో ఎన్నో అవమానాలను ఎదుర్కుంటోంది. కావున రాజకీయాలకతీతంగా ఎలాంటి భేషజాలకు పోకుండా కుల, మత , రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా నియామక ప్రక్రియ జరగాలంటే టీఎస్పీఎస్సీ కి ఒక ప్రత్యేక న్యాయ సలహా వ్యవస్థ ఉండాలి. 

దేశంలో ఎక్కడైనా ఎలాంటి  న్యాయపరమైన చర్చ జరిగి న్యాయ నిర్ణయాలు వస్తున్నా, వాటిని కూలంకషంగా అర్థం చేసుకొని, అలాంటి క్లిష్ట పరిస్థితులు ఇక్కడ పునరావృతం కాకుండా చూసేలా ఒక న్యాయ సలహా కేంద్రం ఉండాలి. ఒక వేల అది ఉండి ఉంటే, దానిలో నిష్ణాతులైన న్యాయ కోవిదులను నియమించి వారి నుండి సరైన న్యాయ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడే అవకాశాలుంటాయి. 

చిత్తశుద్ధి ఎక్కడ?
ప్రస్తుత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మీద ఎన్నో అనుమానాలు. ముఖ్యంగా ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున నమోదైన కేసుల పట్ల మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న వారి మనసులో ఒక సందిగ్ధం. అసలు పరీక్ష జరుగుతుందా జరగదా? సకల అడ్డంకులు తొలిగి అనుకున్నట్టుగానే పరీక్ష జరిగినా తుది ఫలితాలు వస్తాయా, ఒకవేళ మెయిన్స్ సక్రమంగా జరిగి ఫలితాలు వచ్చినా ఉద్యోగాలు ఒక కొలిక్కి వచ్చేనా అనే అనుమానం ప్రతి అభ్యర్థి మదిలో మెదులుతోంది. పరీక్ష పేపర్ లీక్ పేరుతో ఒకసారి బయోమెట్రిక్ సరిగ్గా పని చేయలేదన్న కారణంతో ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. మరీ దారుణంగా బయోమెట్రిక్ కోసం నిధులు లేవంటూ టీఎస్పీఎస్సీ వాదించడం చూస్తా ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. 

ఇప్పుడు కొత్తగా మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకు ఇచ్చే జవాబు పత్రంలోని ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి పేరు హాల్ టికెట్ నెంబర్ ఇస్తామని ముందుగా ఒక మాదిరీ పత్రాన్ని పోయిన వారం విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి పేరు హాల్ టికెట్ నెంబర్ అంటూ ఏదీ ఉండదంటూ, ఖాళీగా ఉండే పత్రాన్ని విడుదల చేసి మరో గందరగోళాన్ని సృష్టించారు. కోర్టు కేసుల చిక్కులతో ఒకపక్క పరువు పోగొట్టుకుంటున్న టీఎస్పీఎస్సీ, మరోపక్క ఇలాంటి చిన్న చిన్న తప్పులతో మరింత పరువు పోగొట్టుకుంటుంది.

చాలా మంది అభ్యర్థులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటూ తమ కల అయినా గ్రూప్ 1 ఉద్యోగాన్ని పొందడం కోసం చాలా కష్టపడుతున్నారు. చేస్తున్న ఉద్యోగానికి తాత్కాలిక విరామం ఇచ్చి కొందరు, ఏ ఉద్యోగం లేక ఇదొక్కటే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా కుస్తీ పడుతున్న వారు ఇంకొందరు అయితే, సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ, అది సాధిస్తామో లేదో అన్న మీమాంసలో వచ్చిన గ్రూప్ 1 అవకాశాన్ని వదులుకోవద్దు అన్న ఉద్దేశ్యంతో మరికొందరు, ఇలా గ్రూప్ 1 కోసం చాలా సీరియస్ గా సిద్ధమవుతున్న వారందరికీ ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి వారిని ప్రస్తుత పరిస్థితులు మానసికంగా కృంగదీస్తున్నాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ కి ఉన్న మచ్చలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ ఉద్యమమే నియామకాల పేరిట సాగింది అనేది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టీఎస్పీఎస్సీ ని  ఘంటా చక్రపాణి తన నాయకత్వంలో సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రూప్ 1 పరీక్ష తో మళ్ళీ కమిషన్ మీద నమ్మకం సడలుతోంది. దీనికితోడు రాజ్యాంగ పదవిలో ఉన్న కొందరు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు జీవో 55 మీద అప్పటి ప్రభుత్వం మీద కోట్లాది మళ్ళీ ఇప్పుడు కొత్తగా జీవో 29 మీద కూడా వాళ్ళే కొట్లాడుతుండడం నిజాయితీగా తయారవుతున్న అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వమే వీరితో ఈ పనులు చూపిస్తుందని కూడా విమర్శిస్తున్నారు. ఇలా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి తమ పనులు చేసుకోవాలని చూస్తుందని అంటున్నారు అభ్యర్థులు. 

ఈడబ్ల్యూఎస్ తో బీసీ లకు అన్యాయమే !!
దేశంలో ఎక్కడా లేని విధంగా 2021 లోనే తెలంగాణలో EWS రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత మన రాష్ట్రానిది. అప్పటినుండి సకల ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వాలు. ప్రస్తుత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సైతం అలాగే కొనసాగుతోంది. దీనిమీద అన్ని వర్గాల ప్రజలు గొంతెత్తుతున్నారు. బహుజనుల సంక్షేమమే పరమావధిగా పని చేస్తామని ఒకపక్క అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆ దిశగా పని చేస్తలేదని అంటున్నారు సామాజిక కార్యకర్తలు. 

ఆధిపత్య కులాల్లో బీదవారు మహా అయితే 1-2 శాతం మాత్రమే ఉంటారని అలాంటి వారికి మొత్తం ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు ఇవ్వడం సరి కాదని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పోయిన వారం విడుదల అయిన డీఎస్సీ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్ర కులాల వారికి ఉద్యోగాలు రావడాన్ని చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ తీసుకువచ్చినప్పుడు గరిష్టంగా 10% అంటూ దానిమీద రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టింది. దీనిని అర్ధం చేసుకోలేని అప్పటి బారాస ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మొదలుపెట్టింది. 

*పరిష్కార మార్గాలు *
రెండు సార్లు రద్దు అయి, ముచ్చటగా మూడో సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ఎన్నో ఆశలతో ముందుకు సాగుతుండగా, ప్రస్తుత కేసులు వారిని ఎంతో మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అభ్యర్థులకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పై ఉంది. ప్రస్తుత గ్రూప్ 1 విషయంలో టీఎస్పీఎస్సీ ఎలాంటి భేషజాలకు పోకుండా సత్వరమే కొంతకాలం పాటు వాయిదా వేయాలి. దొరికిన ఈ సమయంలో ఒక లీగల్ కమిటీ ఏర్పాటు చేసుకుని సరైన న్యాయపరమైన సలహాలు తీసుకోవాలి. ఇక 2022 ప్రకటన ప్రకారం ప్రకటించిన 503 ఖాళీలకు అప్పటి పాత అభ్యర్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కొత్తగా తీసుకొచ్చిన 60 పోస్టులకు కొత్తవాళ్లు, పాత వాళ్ళు అందరిని కలిపి పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా 503 పోస్టులలో ఎస్టీ రిజర్వేషన్ 6% గా తీసుకుని, కొత్త 60 పోస్టులలో 10% గా తీసుకోవాలి. 

ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవీ కాలం డిసెంబర్ 3 తో ముగియనుండటంతో, ఎట్టి పరిస్థితుల్లోనైనా గ్రూప్ 1 ను అప్పటి లోపే పూర్తి చేయాలనే సంకల్పంతో చైర్మన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ ప్రస్తుత గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేసి సోనియా గాంధీ మన్ననలు పొందాలని చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే ఇంతకుమించిన తప్పు మరోటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించిన ఉపయోగం ఉండదు. మెయిన్స్ ను కూడా రద్దు చేయించి రాజ్యాంగ హక్కులు కాపాడేందుకు ప్రస్తుత గ్రూప్ 1 అభ్యర్థులు ఎల్లవేళలా ముందుంటారు. 

ఇంతేకాకుండా స్థానికత విషయంలో సైతం గందరగోళం సృష్టించింది టీఎస్పీఎస్సీ. దీనిపై కూడా స్పష్టమైన నిర్ణయం తో ముందుకెళ్లాలి. ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకొని, టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలకు దానినే వర్తింపజేయాలి కానీ ఎందుకు ఇలా గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. కనుక రాష్ట్ర భవిష్యత్తును అభ్యర్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి నిర్ణయం ద్వారా అభ్యర్థులలో ఉన్న కోపాన్ని కొంతమేర తగ్గించే అవకాశముంది. దీంతోపాటు న్యాయపరమైన నిర్ణయాలు వచ్చాక మాత్రమే నిర్వహించాలి. తద్వారా మాత్రమే అభ్యర్థులకు  న్యాయం చేసినవారవుతారు. 

టీఎస్పీఎస్సీ కమిషన్ నియామక విషయంలో ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించి పాలనానుభవమున్న వివాదరహితులను కమిషన్ లోకి తీసుకోవడమే కాకుండా న్యాయ కోవిదులను కూడా అందులో ఉండేలా చూడాలి, రాజకీయాలకతీతంగా కమిషన్ ను పని చేసేలా చూస్తే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. టీఎస్పీఎస్సీ ప్రతిష్ట కూడా ఇనుమడింప చేయబడుతుంది. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇలాంటి సమస్యకు ఒక పరిష్కారంగా కూడా చెప్పుకోవచ్చు. విషయానుభమున్న అనుభవజ్ఞులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించాలి. 

-డా. కిరణ్‌ దాసరి
Ph.D. (USA)Secretary,
Backward Classes Chambers of Commerce and Industry - BICCI

#tg-group-1 #exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe