BRAOU: చదువుతో పాటు స్టైపెండ్.. అంబేద్కర్ ఓపెన్ యనివర్సిటీ గుడ్ న్యూస్!

విద్యార్థులు నేర్చుకుంటూ నెలకు రూ. 7,000-రూ.24,000 వరకు స్టైపెండ్ ను పొందే అవకాశం కల్పిస్తోంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందుకోసం రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI) తో మా విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది.

New Update
BRAOU

ఉన్నతవిద్యను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చి, సమాజంలో ముఖ్యంగా ఇప్పటివరకు అవకాశాలు అందని వారికి చదువుకునే అవకాశాలు విస్తృతపరిచే ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చేపట్టిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. 1982లో భారతదేశంలోనే మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా మేము ప్రారంభమైనప్పటి నుండి BRAOU ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ముఖ్యంగా సమాజంలోని అట్టడుగువర్గాలకు చేరువ కావడంలో ఒక దీపస్తంభంలా నిలిచింది. సమ్మిళిత విద్యలో మా నిబద్ధత వల్ల ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యారు. వీరిలో మహిళలు, గ్రామీణ, గిరిజన, వెనుకబడినవర్గాల నుండి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం ఉంది. ఈ రోజు మేము మా ప్రధాన లక్ష్యం నెరవేర్చడానికి చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటిస్తునందుకు చాలా సంతోషిస్తున్నాం. విద్య సమగ్రంగా, సమానంగా అందరికీ అందాలనే లక్ష్యంతో అలాగే చదువుతో పాటు ఉపాధి అందుకు కావలసిన నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ అందించడానికి డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూనుకున్నది.

ఇప్పుడు ఈ యూనివర్సిటీ పార్ట్ టైం చదువులకే కాకుండా ప్రత్యక్ష ఉపాధి కల్పనకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతోంది. ఈ మార్పు జాతీయ అవసరాలకు మరియు ప్రపంచ విద్యా పోకడలకు సరిగ్గా సరిపోతుంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో మా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించడానికి, ఆవిష్కరించడానికి మరియు నాయకత్వం వహించడానికి ఇది వారికి అధికారం ఇస్తుంది.  ఈ గొప్ప మార్పు మా భవిష్యత్ దృష్టికి ప్రతీకగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్త లోగోను ఆవిష్కరించిందని కూడా ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. 'నిన్ను నడిపించే శక్తి నీలోనే ఉన్నది 'అన్న బుద్ధుడి ప్రజాస్వామిక స్పూర్తికి ప్రతీకగా ఉండే “అప్పొ దీపోభవ" సూక్తిని చలన సూత్రంగా చేసుకుని ఆధునిక భారత జాతి నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని దిక్సూచిగా మార్చుకుని ముందుకు కదులుతున్నాం. ఇందులో భాగంగా కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రకటిస్తున్నాం. ఇది మా ప్రయాణానికి అలాగే ఇప్పుడు చేపడుతున్న ప్రాక్టికల్, ఉపాధి-కేంద్రీకృత విద్యపై మా కొత్త దృష్టికి ఆధునిక చిహ్నంగా పనిచేస్తుంది. 

విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు అవసరం కాబట్టి మేము ఈ విద్యాసంవత్సరం నుంచి సరికొత్త గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్ వర్క్ రూపొందించాం. కెనడా లోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సహకారంతో ఈ ప్రణాళిక రూపొందించాం. ఇందులో భాగంగా కొన్ని కొత్త విద్యా ప్రణాళికలు కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాం. 

స్టైపెండ్-ఆధారిత విద్యా కార్యక్రమం (STEP):

 ఈ ప్రధాన కార్యక్రమం మా అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిషిప్ల ద్వారా అమూల్యమైన చదువుతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని పొందటానికి దోహదపడుతుంది.  విద్యార్థులు నేర్చుకుంటూ నెలకు రూ. 7,000 నుండి రూ.24,000 వరకు స్టైపండ్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం దేశంలోని ప్రధాన దుకాణ సముదాయాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములుగా ఉన్న రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI) తో మా విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుంది. మొదటగా 10,000 మంది విద్యార్థులను ఈ కార్యక్రమ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నాం. వారంలో వీలైనన్ని రోజులు సమీప వర్తక, వాణిజ్య కేంద్రాల్లో శిక్షణ పొందుతూ, పనిచేసుకుంటూ చదువుకునే వీలు కల్పిస్తున్నాం. ఇందులో సగం మంది మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని, వీలయినంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులను ఇందులో చేర్చాలని భావిస్తున్నాం. 

రెండోది మహిళలను వృత్తి నైపుణ్యంవైపు నడిపించే కార్యక్రమం. దీనికోసం ప్రభుత్వ సంస్థ WeHub తో కలిసి We -Enable కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం భారతదేశపు మొదటి రాష్ట్ర ప్రభుత్వ ఇంక్యుబేటర్ అయిన WeHub భాగస్వామ్యం తో మా మహిళా విద్యార్థులలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ప్రతి సంవత్సరం 2,000 మంది మహిళా విద్యార్థులను సమస్యలను పరిష్కరించే వారిగా మరియు ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే వ్యూహాత్మక నైపుణ్య సహకారాలు అందించే భాగస్వామ్యాల ద్వారా మేము మా పరిధిని విస్తరిస్తున్నాము. అందులో భాగంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ద్వారా ఏటా 5,000 మంది గ్రామీణ మరియు గిరిజన విద్యార్థులకు స్వల్ప-కాలిక వృత్తి కోర్సులను అందించబోతున్నాం. 

తెలంగాణ లోని పారిశ్రామిక ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వాములుగా చేసుకుని కార్మికులు వారి కుటుంబాలకు వృత్తి శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) సహకారం తో ప్రతి సంవత్సరం 10,000 మంది అభ్యర్థులను విద్యా వికాసంవైపు నడిపించాలని అనుకుంటున్నాం.  రాబోయే దశాబ్దంలో ఒక లక్ష కుటుంబాలకు ఉన్నత విద్యావకాశాలు అందించాలన్నది మా సంకల్పం. అదనంగా ప్రతి సంవత్సరం 10,000 మంది గ్రాడ్యుయేట్లకు కీలకమైన ఆంగ్ల భాష మరియు జీవన నైపుణ్య శిక్షణను అందిస్తాం. దానికోసం ఒక ప్రత్యేక భాషా శిక్షణ కార్యక్రమం రూపొందిస్తున్నాం. 

వీటన్నిటితో పాటు సమాన అవకాశాలు సాధించడం కోసం 'సమత' ఫ్రీషిప్లు & నిపుణ ఫెలోషిప్లు ఇవ్వబోతున్నాం. సమానత్వం పట్ల మా నిబద్ధతను నిలబెట్టుకుంటూ, మేము కొత్త స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టాము. సమత ఫ్రీషిప్ ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్ జెండర్ ప్రజలు, శారీరక వికలాంగులు మరియు దివ్యాంగులకు ఉచిత విద్యను అందించబోతున్నాం. ఇప్పటివరకు దేశంలో ఏ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. దీనివల్ల తెలంగాణలో ట్రాన్స్ జెండర్ తో పాటు దివ్యాంగులు, గోండు కోయ, చెంచు ఆదివాసులు ఎలాంటి రుసుము లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫెలోషిప్లు అన్ని వెనుకబడినవర్గాలకు నైపుణ్య అభివృద్ధి, వృత్తి శిక్షణ మరియు భాషా అభ్యాసానికి మద్దతిస్తాయి. ఖర్చులు పూర్తిగా విశ్వవిద్యాలయం భరిస్తుంది. ఈ పథకాలు ప్రతి సంవత్సరం కనీసం 5,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. 

అలాగే మేము ఇప్పుడు యూజీసీ నూతన లాటరల్ ఎంట్రీ పాలసీని ఆవిష్కరించాం. దీనివల్ల డిగ్రీలో చేరడానికి సరళమైన నిబంధనలలు అమలులోకి వచ్చాయి. దీనివల్ల ఒకేసారి రెండు డిగ్రీలు (డ్యూయల్ డిగ్రీలు) అలాగే పాలిటెక్నిక్ ఐటీఐ వంటి నైపుణ్య ఆధారిత కోర్సులకు క్రెడిట్ ఇంటిగ్రేషన్ అంటే అప్పటికే చదివి ఉన్న కోర్సులను గుర్తించడం జరుగుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా మా వద్ద సమాంతరంగా ఏకకాలంలో మావద్ద బీ.ఎస్సీ ఇతర విశ్వవిద్యాలయాల లో B.Tech డిగ్రీలను చదువవచ్చు. అలాగే ఇంజినీరింగ్ మధ్యలో మానేసిన వాళ్ళు- డ్రాపౌట్లు కూడా మావద్ద డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, రాబోయే దశాబ్దంలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరుకోవాలని, నైపుణ్య ఆధారిత, ఉపాధి ఆధారిత విద్యను అందరికీ నిజం చేయాలని మేము ఆశిస్తున్నాము. 

Advertisment
తాజా కథనాలు