Hyderabad Metro Trains: కొత్త సంవత్సరం (New Year) వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వాసులకు ఊరట కలిగించే విధంగా డిసెంబర్ 31న (December 31) ఆదివారం అర్థరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఇదే సమయంలో భద్రత విషయంలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. రాత్రి 8గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ. 15 వేల జరిమానతోపాటు 2ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మొదటిసారి దొరికిన వాళ్లకు గరిష్టంగా రూ10వేల ఫైన్ తోపాటు 6నెలల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఇక రెండోసారి పట్టుబడినట్లయితే రూ. 15వేల జరిమానాతోపాటు రెండేళ్ల వరకు జైలు శిక్షి విధిస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకూ కూడా వెనకడమని స్పష్టం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. వేడుకలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. పబ్బులు, న్యూ ఇయర్ వేడుకల ప్రదేశాలు, స్టార్ హోటళ్ల వద్దపార్కింగ్ యాజమాన్యాలదే బాధ్యత అని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పరిమితికి మించి పాసులు ఇవ్వకూడదన్నారు.
అర్థరాత్రి 1గంట వరకే పర్మిషన్ :
డిసెంబర్ 31న అర్థరాత్రి 1గంట వరకే వేడుకలకు పర్మిషన్ ఉంటుందని ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే లిక్కర్ అమ్మాలని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో అశ్లీల నృత్యాలు, అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాలు మొత్తం కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈరోజు రాత్రి ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని..అలా చేస్తే జరిమాన విధిస్తామని క్యాబ్ డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రైడ్ నిరాకరించకూడదన్నారు. రూల్స్ అధిగమిస్తే మోటార్ వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ రైడ్ క్యాన్సల్ చేస్తే 9490617346కు క్యాబ్ నెంబర్, సమయం, ప్రదేశం వంటి వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు.