Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం నుంచి తీవ్ర విమర్శలపాలవుతోంది. క్రీడాకారులకు వసతులు కల్పించడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారంటూ స్టార్ ప్లేయర్స్, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఒలింపిక్స్ లో ఇచ్చిన పతకాలు రంగు (Olympic Medal Color) కోల్పోవడం సంచలనంగా మారింది. అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ (Nyjah Huston) తనకు ఇచ్చిన కాంస్య పథకం రంగు వారానికే వెలసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్‌లో (Skate Boarding) స్కేటర్ హ్యూస్టన్ కాంస్య పతకం సాధించాడు. అయితే తన పతకాన్ని ఎంతో గొప్పగా మెడలో వెసుకు తిరుగుతున్న హ్యూస్టన్.. ఒక వారం తర్వాత పరిశీలించి చూడగా రంగు పోయినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తూ.. ‘ఈ ఒలింపిక్ పతకాలు ఇచ్చిన కొత్తలో అద్భుతంగా కన్పించాయి. నిజానికి ఇందులో అనుకున్నంత క్వాలిటీ లేదు. నా చెమటకు తడిస్తేనే వీటి రంగు పోయింది. ముందువైపు గరుకుగా మారి, దాని షేప్ మారిపోయింది. మరింత నాణ్యతగా తయారు చేస్తే బాగుటుంది’ అంటూ ఒలింపిక్స్ నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హ్యూస్టన్ పోస్ట్ పై పారిస్ ఒలింపిక్స్ అధికారులు రియాక్ట్ అయ్యారు. హ్యూస్టన్ పోస్ట్ మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే చర్యలు మొదలుపెట్టాం. డ్యామేజ్ అయిన పతకాలను రిప్లేస్ చేసేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు.