AP News: ఇటీవల నూజివీడులో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు ట్రిపుల్ ఐటి డైరక్టర్ ను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటి పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో కాలేజి ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యశాఖ ఇన్ ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, ఏలూరు కలెక్టర్ కె. వెట్రి సెల్వి సభ్యులుగా ఉంటారు.
పర్యవేక్షణ కమిటీ ఈ క్రింది అంశాలపై దృష్టిసారిస్తుంది.
1. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత నిర్వహణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ పాటించడం.
2. పారిశుధ్యం, మెస్ యొక్క పరిశుభ్రత నిర్వహణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ అమలుచేయడం.
3. విద్యార్థుల హాస్టల్ లో మెరుగైన పారిశుధ్యం, నాణ్యతా ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకోవడం.
4. నూజివీడు ట్రిపుల్ ఐటిలో అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న మరమ్మతులు చేయడం.
5. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయడం, ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వేగంగా వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం.
6. ప్రతి డిపార్ట్‌మెంట్ స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డ్రగ్ ఫ్రీ, పొగాకు రహిత సంస్థల కోసం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం.
7. ప్రతి విద్యార్థి విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన నైపుణ్యానికి చర్యలు తీసుకోవడం. విద్యార్థుల మానసిక శారీరక శ్రేయస్సు కోసం కాలేజ్ వెల్‌నెస్ టీమ్‌ను ఏర్పాటు. కాలేజీ వెల్‌నెస్ టీమ్‌లో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ (లేదా తత్సమానం), ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు (ప్రాధాన్యంగా స్త్రీ), ప్రతి విభాగం నుండి విద్యార్థి మానిటర్లు, తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు ఉంటారు. సంస్థ యొక్క ప్రధాన పర్యవేక్షకులు, కౌన్సెలర్లు / మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో హాని కలిగించే విద్యార్థుల చుట్టూ భద్రతా వలయం ఏర్పాటుచేసి డేగకన్నేసి ఉంచుతారు.
ఆహార నాణ్యత, చిన్నచిన్న మరమ్మతులు, కొన్ని సున్నితమైన అంశాలు, వైద్య పర్యవేక్షణపై ఫిర్యాదులు వంటి సమస్యల తక్షణ పరిష్కారానికి నిర్ణీత సమయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ పర్యవేక్షక కమిటీకి సూచించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే కమిటీ ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.