NTR Jayanthi: నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. ఎన్టీఆర్ లాంటివారు!

తెలుగుజాతి పౌరుషాన్ని వెన్నుతట్టి లేపిన వారు.. తెలుగుప్రజల గౌరవాన్ని అంతర్జాతీయంగా నిలబెట్టిన వారు.. అందరం ఎన్టీఆర్ గా పిలుచుకునే నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల వెలుగుగా ఎందుకు ఎన్టీఆర్ ని స్మరిస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

NTR Jayanthi: నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. ఎన్టీఆర్ లాంటివారు!
New Update

NTR Jayanthi: ఒక మనిషి గురించి చెప్పుకోవాలంటే ఏముంటుంది? పుట్టారు.. పెరిగారు.. మరణించారు.. అంతే కదా. కానీ, మహనీయుల గురించి మాట్లాడుకోవాలంటే.. సామాన్యుడిగా పుట్టి టార్చ్ బేరర్ గా మారినవారి గురించి చర్చించాలంటే.. మనకి అసలు టైమే చాలదు. రోజులు.. నెలలు.. సంవత్సరాలు ఇలా కాలం గిర్రున తిరగవచ్చు.. కొందరు చూపించిన మార్గం.. కొంతమంది చేసిన మంచి.. వారు గతించినా.. మన జీవితాల్లో మాత్రం ఎప్పుడూ ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అలాంటివారిలో తెలుగుతనానికి.. తెలుగు గౌరవానికి.. తెలుగువారి తెగింపుకి.. తెలుగుజాతి మర్యాదకి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చినవారు నందమూరి తారకరామారావు మొదటి వరుసలో ఉండే మహనీయుడు. ఆయన పుట్టినరోజు(NTR Jayanthi) ఈరోజు (మే 28).  అదేంటి జయంతి అనాలి కదా అంటారా? ఎన్టీఆర్ గా మనం పిలుచుకునే ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరంజీవే. అందుకే పుట్టినరోజు అన్నాం.

తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ ని స్మరించకుండా.. ఎన్టీఆర్ గురించి ప్రస్తావించకుండా ఒక్కరోజు కూడా ఉండదు. ఎందుకు ఆయనను అంతలా స్మరిస్తారు? సినిమాల్లో పెద్ద హీరోగా వెలిగారనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారనా? ఇవేవీ కాదు.. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ప్రతీకగా నిలిచారు కాబట్టి. దేశంలో తెలుగు ప్రజలను హేళనగా చూసే రోజుల్లో తెలుగుజాతి అంటే ఇదిరా.. అంటూ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు కాబట్టి. ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేశారు? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు? ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం ఏమి చేశారనేది ఒక్కసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకోవడమే ఆయనకు మనం అర్పించే ఘన నివాళి. 

NTR Jayanthi

మద్రాసీలు..
భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలి అని ఎందరో చేసిన త్యాగాలకు ప్రతిరూపంగా ఏర్పడింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రోజులు.. సంవత్సరాలు గడిచినా.. మద్రాసీలు అనే ముద్ర నుంచి మాత్రం బయటపడలేదు. రాజకీయ చైతన్యం తక్కువ. ఇంకా చెప్పాలంటే, సామాన్యులకు రాజకీయాలు అంటే ఏమిటో తెలీదు. తెలుగు ప్రజలు సున్నిత మనస్కులు. సెంటిమెంట్-ఎమోషన్స్ ఎక్కువ. అందుకే, ఇందిరాగాంధీ మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తే నెత్తిన పెట్టుకుని గెలిపించారు. కానీ, అప్పట్లో జాతీయ పార్టీలు ఏవీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేవి కాదు. దక్షిణాది నాయకులు అంటే చిన్న చూపు ఉండేది. కొంతలో కొంత మద్రాస్ (ఇప్పుడు చెన్నై) అంటే ప్రత్యేకంగా చూసేవాళ్ళు. కానీ, ఒక్కడొచ్చాడు.. తెలుగు జాతి వెన్ను తట్టి.. సామాన్యుల్లో రాజకీయ చైతన్య స్ఫూర్తి నింపాడు. ఆయనే ఎన్టీఆర్(NTR Jayanthi). వెండితెర వేల్పుగా ఆబాలగోపాలం ఎన్టీవోడుగా పిలుచుకునే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎక్కడో మూలన పడిపోయిన తెలుగు పౌరుషాన్ని తన మాటలతో తట్టి లేపాడు. బాంచన్ అని ఢిల్లీ పెద్దలకు మొక్కి రాజకీయాలు చేసే నేతల వెన్నులో వణుకు తెప్పించాడు. తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి గౌరవాన్ని అధికారంలోకి తెచ్చాడు. దక్షిణాది అంటే మద్రాసీలు కాదు.. తెలుగు కూడా ఉంది అని జాతీయంగా కాదు.. కాదు.. అంతర్జాతీయంగా చెప్పుకునేలా చేశారు. 

publive-image

సంక్షేమం..
అధికారం.. అధికారం.. అధికారం.. ఇది తప్ప ఉమ్మడి ఏపీలో అప్పటి రాజకీయనాయకులకు మరేమీ పట్టేది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వస్తే వారే సీటులో కూచునే వారు. పాపం ఆ నాయకుడు నానా కష్టాలు పడి సీల్డ్ కవర్ లో పేరు వచ్చేలా చేసుకుని.. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఆయన్ను పడేయడానికి నలుగురైదుగురు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉండేవారు. దీంతో ప్రజాపాలన.. సంక్షేమం వీటి గురించి ఆలోచించే టైమ్ ఎవరికీ ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్(NTR Jayanthi) వచ్చారు. సంక్షేమం అంటే ఏమిటో చూపించారు. రూపాయికే కిలో బియ్యం పథకం తీసుకువచ్చారు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ ఆయన పేదవాడి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే.. అభివృద్ధికీ బాటలు వేశారు. ఆయన తీసుకువచ్చిన ఒక్కో పథకం పేదల పాలిట కల్పవృక్షం అయింది. రూపాయి ఖర్చు చేయాలంటే.. ఢిల్లీ పెద్దల ముందు చేయిచాపాల్సిన స్థితి నుంచి మన రాష్ట్రం.. మన ప్రజలు.. మన పాలన అంటూ ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దల కొమ్ములు వంచిన తీరు తెలుగు ప్రజల జీవితాల్ని పెద్ద మలుపు తిప్పింది. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితాలను ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కి ముందు.. ఎన్టీఆర్ కి తరువాత అని చెప్పవచ్చు. అంతలా రాజకీయంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల జీవితాలపై తక్కువ సమయంలో ఎక్కువ ముద్ర వేశారు. 

publive-image

జాతీయ స్థాయిలో..
భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీలా మారిపోయిన రోజులవి. కాంగ్రెస్ హవాను ఆపగలిగే శక్తి ఉన్న ఏకైక పార్టీ ఏదీలేని పరిస్థితి. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసేతర శక్తులను ఒక్కతాటిమీదకు తీసుకు వచ్చి నేషనల్ ఫ్రంట్ పేరుతో కూటమి రాజకీయాలకు తెరలేపారు ఎన్టీఆర్(NTR Jayanthi). ఇప్పటికీ అయన చూపించిన కూటమి మార్గమే దేశంలో రాజకీయ ఇరుసుగా ఉందనేది సత్యం. ఇప్పటి ఎన్డీఏ కూటమి అయినా.. ఇండియా కూటమి అయినా అవి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పేరుతో అప్పట్లో చేసిన విజయవంతమైన రాజకీయ విన్యాసానికి కొనసాగింపులే అనేది అక్షర సత్యం. 

publive-image

Also Read:  భారత తొలి ప్రధాని.. నెహ్రూ వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ!

వారసత్వ రాజకీయాలు…
వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్టీఆర్. అందుకే, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలని ఎప్పుడూ విమర్శించేవారు. కానీ, ఆయన మాత్రం అదే వారసత్వ రాజకీయాల కారణంగా నిస్సహాయుడిగా మారిపోవడమే విచారకరం. తప్పు.. ఒప్పుల మాట పక్కన పెడితే.. ఏమి జరిగింది.. ఎలా జరిగింది అనేది వదిలేస్తే.. వారసత్వం కోసం వ్యక్తిగతంగా ఆయనను అప్రతిష్ట పాలు చేసినా.. చివరి వరకూ ప్రజా సంక్షేమమే తన పరమావధి అని జీవించారు ఎన్టీఆర్(NTR Jayanthi). నందమూరి తారక రామారావు అంటే ఒక వ్యక్తి కాదు. వెనుకబడిన తెలుగు ప్రజల జీవితాలను ముందుకు నడిపించి వెలుగు చూపించిన ఒక శక్తి. ఇప్పటికీ ఎన్టీఆర్ చూపించిన వెలుగు బాటలోనే తెలుగు ప్రజలు నడుస్తున్నారు. ఆ వెలుగు ఎప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంటుంది.

మొత్తమ్మీద ఎన్టీఆర్ సినిమాలోనే ఒక పాటలో చెప్పినట్టు.. నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. వారిలో ఎన్టీఆర్ ఒక్కరు. అందుకే తెలుగు ప్రజలు ఇప్పటికీ మా దేవుడు మీరే ఎన్టీఆరూ అనుకుంటూనే ఉంటున్నారు. 

#ntr #ntr-jayanthi #telugu-desham
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe