Hyderabad: ఇక నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వాహనాలు (Heavy Vehicles) తిరిగేందుకు అనుమతి లేదని మాదాపూర్ జోన్ ఇన్ చార్జి ట్రాఫిక్ డీసీసీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అనుమతి లేదు..
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సైబరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ ను ఆయన గురువారం సాయంత్రం వెల్లడించారు. సైబరాబాద్ రోడ్ల పై హెవీ వెహికల్స్ అయినటువంటి డీసీఎం, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్లకు రోజూ ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు..తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు అనుమతి లేదని డీసీపీ శ్రీనివాస్ రావు చెప్పారు.
మొదటి సారి ఫైన్..
కన్‌స్ట్రక్షన్ అండ్ డిమాలేషన్ వాహనాలకు ఉదయం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు అనుమతి లేదని పేర్కొన్నారు. నిషేధిత సమయాల్లో వాహనాలు తిరిగితే కనుక మొదటి సారి ఫైన్ విధించి రెండో సారి కూడా రూల్స్ బ్రేక్ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి ఆర్టీఏకి అప్పగిస్తామని ఆయన గట్టిగా చెప్పారు.
ఇక నుంచి నగరంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని వివరించారు. స్కూల్, కాలేజీ, ఆర్టీసీ బస్సు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా రూల్స్ పాటించాల్సిందేనని తెలిపారు. ఆసుపత్రులు మల్టీప్లెక్స్ ల ముందు కానీ వాహనాలు పార్క్ చేస్తే నోటీసులు ఇస్తామని తెలిపారు.
పుట్‌పాత్ లపై వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వివరించారు.
Also read: అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి చిత్రం !