Supreme Court: సాయంత్రానికి విధుల్లో చేరాలి..సుప్రీం ఆదేశాలు!

ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్‌ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.28 రోజులుగా సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.దీని వల్ల 23 మంది సాధారణ పౌరులు మరణించినట్లు పేర్కొంది.

author-image
By Bhavana
New Update
సాయంత్రానికి విధుల్లో చేరాలి..సుప్రీం ఆదేశాలు!

Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్‌ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో వైద్యులంతా కూడా ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం గట్టిగా చెప్పింది. 

యావత్‌ దేశాన్ని కుదిపేసిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్ విద్యార్థిని హత్యాచారం కేసుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్‌లో 28 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు బెంగాల్‌ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీంతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడటంతోపాటు 23 మంది సాధారణ పౌరులు మరణించినట్లు పేర్కొంది. అలాగే వైద్యుల భద్రతా చర్యల కోసం నిధులు మంజూరు చేశామని, జిల్లా కలెక్టర్లు దీనిని పర్యవేక్షిస్తారని అఫిడవిట్‌లో తెలియజేసింది.

కాగా, బెంగాల్‌ డాక్టర్లు తమ నిరసన విరమించాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వైద్యులను మరోసారి కోరారు. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు వైద్యులు విధులకు హాజరైనట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తాము తెలియజేస్తామని అన్నారు. డాక్టర్లకు భద్రతా సౌకర్యాలు కల్పించినప్పటికీ విధులకు దూరంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో వారి పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

 

Advertisment
తాజా కథనాలు