మణిపూర్‌లో హింస ఆగడం లేదు. నెలన్నర గడిచినా పరిస్థితి మెరుగుపడడం లేదు. మంగళవారం అర్థరాత్రి రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. హింసాకాండ సందర్భంగా కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాల కారణంగా 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజధాని ఇంఫాల్‌లో నిన్న రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు ఎస్పీ శివకాంత సింగ్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించారు.
పూర్తి వివరాల ప్రకారం… రాజధాని ఇంఫాల్ తూర్పు కాంగ్ పోక్పి జిల్లా సరిహద్దులో అగిజాంగ్ గ్రామంలో నిన్న రాత్రి పదిగంటలకు సాయుధ దుండుగుల గ్రూపుతో చెలరేగిన ఎదురుకాల్పుల్లో 9మంది మరణించారు. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో హింసను పెంచుతున్న దుండగులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ శివకాంత తెలిపినట్లు నేషనల్ మీడియా పేర్కొంది.
తాజాగా చెలరేగిన హింసాత్మక ప్రాంతం భద్రత బాధ్యతలను అస్సాం రైఫిల్స్ చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోపరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. కొండి జిల్లాలో ఎక్కువగా నివసించే గిరిజన కుకీలు, ఇంఫాల్ లోయలో ఆధిపత్య కమ్యూనిటీ అయిన మైతీ వర్గాల మధ్య మే 3 నుంచి హింస చెలరేగుతూనే ఉంది. ఈ హింసలో కనీసం ఇప్పటివరకు 115 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40వేలకు పైగా మంది నిరాశ్రులయ్యారు. మైతీలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలన్నీకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన ఈ నిరసనలో భాగంగా ఈ హింస చెలరేగింది. ఈ హింస మొత్తం రాష్ట్రాన్ని వ్యాపించింది. దీంతో రాష్ట్రంలో అత్యంత ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలను కాపాడేందుకు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ నిలిపివేశారు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో అదనపు బలగాలను రాష్ట్రానికి తరలించి మోహరించినటప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు.