Telangana : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త!

మందుబాబులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. తెలంగాణలో కొత్త కంపెనీ బీర్లు రాబోతున్నట్లు తెలిపారు. నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే సోమ్ డిస్టిలరీస్ కంప‌నీ త‌మ ఉత్పత్తుల‌ను తెలంగాణ బేవ‌రేజ్ కార్పోరేష‌న్ కు స‌ర‌ఫరా చేసేందుకు అనుమ‌తినిచ్చిందన్నారు.

New Update
Telangana : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త!

Liquor Brands : నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే సోమ్ డిస్టిలరీస్ కంప‌నీ (Som Distilleries Companies) త‌మ ఉత్పత్తుల‌ను తెలంగాణ (Telangana) బేవ‌రేజ్ కార్పోరేష‌న్ కు స‌ర‌ఫరా చేసేందుకు అనుమ‌తినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చెప్పారు. కొత్త మ‌ద్యం బ్రాండ్లకు సంబంధించి త‌మ వ‌ద్దకు ఎలాంటి ద‌ర‌ఖాస్తులు రాలేవ‌ని, గ‌తంలో ఓ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా తాను చేసిన వ్యాఖ్యల‌కు క‌ట్టుబ‌డి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆ ఫైల్ త‌న వ‌ద్దకు రాలేద‌ని, ఇప్పుడు ఉన్న ప్రోసీజ‌ర్ ప్రకార‌మే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవ‌రేజ్ కార్పోరేష‌న్ కు ఉంద‌ని, ఈ నేప‌థ్యంలోనే సోమ్ డిస్టిల‌రీస్ కు త‌మ ఉత్పత్తుల స‌ర‌ఫ‌రాకు అమ‌మ‌తినిచ్చార‌ని వెల్లడించారు. బేవ‌రేజ్ కార్పోరేష‌న్ రోజువారీ కార్యక‌లాపాలు త‌మ దృష్టికి రావ‌ని, వాస్తవ‌వాల‌ను తెలుసుకోకుండానే కొన్ని ప‌త్రిక‌లు అస‌త్య ప్రచారం చేస్తున్నాయన్నారు.

హోల్‌సేల్ మ‌ద్యం స‌ర‌ఫ‌రా..
రాష్ట్రంలో హోల్‌సేల్ మ‌ద్యం (Wholesale Liquor) స‌ర‌ఫ‌రాకు కొత్త బ్రాండ్లకు అనుమ‌తులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప‌రిధిలో ఉంటుంద‌ని, డిమాండ్- స‌ప్లయ్ ను బ‌ట్టి కొత్త కంప‌నీల‌కు అనుమ‌తులు మంజూరు చేస్తుంద‌ని పేర్కొన్నారు. రెండు ద‌శాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ త‌మ ఉత్పత్తుల‌ను విక్రయిస్తుంద‌ని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాల‌సీ ప్రకార‌మే బెవ‌రేజ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ఎండీ.. సామ్ డిస్టిలరీస్ తో పాటు ఇత‌ర కంపనీల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తులిచ్చార‌ని తెలిపారు. ఎక్కడా కూడా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని స్పష్టం చేశారు.

కొత్త బ్రాండ్లకు అనుమ‌తులు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నాలుగు సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమ‌తులు ఇచ్చిన విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 2020-2021 సంవ‌త్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంప‌నీల‌కు, 2021-2022లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ల కంప‌నీల‌కు, 2022-2023లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంప‌నీల‌కు, 2023-2024లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంప‌నీల‌కు అనుమ‌తులు ఇచ్చిందని చెప్పారు. గ‌తంలో కూడా బెవ‌రేజ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ కొత్తగా మ‌ద్యం కంప‌నీల‌కు ఇలానే అనుమ‌తులు ఇచ్చింద‌ని, ఆ ప్రోసీజ‌ర్ ప్రకార‌మే తాము అప్రూవ‌ల్ ఇచ్చామ‌ని.. దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్త ప‌త్రిక‌లు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మొత్తం IMFL/బీర్ల త‌యారీ, స‌ప్లయ్ చైన్ 97.44% విదేశీ కంప‌నీలే ఆక్రమించాయ‌ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మ‌న దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీకి మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమతులు ఇయ్యడాన్ని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయ‌కులు రాజ‌కీయం చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని, ఇలాంటి అసంబ‌ద్దమైన దుష్ప్రచారాల‌ను ప్రచారం చేయ‌డం మానుకోవాల‌ని కోరారు. ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు ప్రచారం చేస్తూ.. ప్రజ‌ల విలువైన స‌మయాన్ని వృధా చేయ‌వ‌ద్దని సూచించారు.

Advertisment
తాజా కథనాలు