ప్రస్తుత రోజుల్లో బంధాలు గుదిబండలయ్యాయి, స్నేహాలు ఉట్టి ఊహలుగా మిగిలిపోయాయి. ఈ మధ్యకాలంలో కొన్ని తాత్కాలిక స్నేహాలు (friendships) చిగురిస్తున్నాయి. అవసరాల కోసమే ఆప్యాయంగా పలుకరిస్తూ ఆ అవసరం తీరాక ముఖం చాటేయడం లేటెస్టు ఫ్యాషన్‌గా మారిపోయింది. బంధాలు, స్నేహం అనే పదానికి అసలు విలువేలేకుండా పోయింది. కొందరు స్నేహాన్ని అతిగా నమ్మి జీవితాలను సైతం నాశనం చేసుకుంటున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలనేది అర్థంకాక కొందరు అతి ప్రేమలు చూపిస్తూ మోసపోతున్నారు. ఫ్రెండ్‌షిప్ ది బెస్ట్ (Friendship the best) అంటూ ఉత్సాహం చూపి ప్రాణాలపైకి సైతం తెచ్చుకుంటున్న పరిస్థితులు కోకొల్లలు. మరికొందరు స్నేహం కోసం ఆర్థికంగా నష్టపోయినవారూ ఉన్నారు. స్నేహాన్ని వీడలేక.. ఆర్థికంగా ఎదగలేక.. మానసికంగా బాధపడుతూ ఉండిపోతున్నారు.
నిబంధన మేరకు ఉండాలి
అసలు వీటంతటికీ కారణం ఉండాల్సిన పరిమితి కంటే ఎక్కువ చనువుగా మెలిగితే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయని కొందరు అంటున్నారు. స్నేహమైనా.. ప్రేమైనా.. పరిమితులకు లోబడి ఉంటేనే అందం.. ఆనందమని చెబుతున్నారు. ఏ బంధమైనా ఒక నిబంధన మేరకు ఉంటేనే ఎలాంటి అభాండాలూ పడాల్సిన అవసరాలు రావన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎవరి పనివారు చేసుకుంటూ.. చూపించాల్సిన ప్రేమను చూపిస్తే జీవితమంతా సంతోషంగా గడిపేయొచ్చనేది అర్థమవుతోంది. ఎవరికీ ఎలాంటి సమస్యలూ ఉండవనేది మానసిక నిపుణుల మాట.
రాబంధుల్లా మారి పీక్కుతినడమే
కొన్ని సందర్భాల్లో అనుకోని స్నేహాలు ఎదురవుతూ ఉంటాయి. పూర్తిగా నమ్మకుండా ఎదుటి వారికి మన ఆంతరంగిక విషయాలు పంచుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల అసలుకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. నమ్మకమైన స్నేహం.. అర్థం చేసుకునే స్వభావంతో పాటు మన సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉన్నవారికే మన విషయాలు చెప్పుకుంటే బెటర్. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతే తప్పు వాళ్లది కాదు నీదే అవుతుంది. ఇక బంధువుల విషయానికొస్తే ఒకప్పుడు కష్టమొస్తే ముందుండే వాళ్లు.. నేనున్నానంటూ ఓదార్చేవాళ్లు.. ఇప్పుడు రాబంధుల్లా మారి పీక్కుతినడమే తక్కువైంది. బంధాలు.. బంధుత్వాలు లేవు, అంతా స్వార్థపూరిత (selfish) విధానాలే. మంచి చేయడం పక్కన పెడితే అంతా చెడు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చే మనుషుల మధ్యలో బతుకుతున్నాం. అందరినీ నమ్ముకుంటూ.. మనం మోసపోతూ బాధపడే కంటే..మన జీవితం మనం చూసుకుని.. వీలుంటే వేరేవారికి సహాయపడటం మంచిది. అప్పుడు లైఫ్‌ను హ్యాపీ (Happy life)గా గడిపేస్తే ఎవరికీ ఏ బాధా ఉండదు. లేనిపోని గొప్పలకుపోతే చివరికి తిప్పలు తప్పవని గుర్తుపెట్టుకోండి.
ఇది కూడా చదవండి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పట్‌లో నలుగురు మృతి