అగ్రనేతలు పార్టీని వీడుతున్న వేళ.. తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కొత్త పంచాయితీ మొదలైంది. సీట్ల కేటాయింపుపై ముఖ్య నేతల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ టికెట్ ను తన కుమారుడికి కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పార్టీని కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ తో ఆయన భేటీ అయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటును తన తనయుడు వికాస్ రావుకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ (Eatala Rajendar) మాత్రం మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమకు అక్కడి నుంచి టికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS Politics 2023: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి?
ఈటల రాజేందర్ తో పాటే తుల ఉమ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇన్నాళ్లు అక్కడ పని చేసుకున్న తుల ఉమను కాదని వికాస్ రావుకు టికెట్ ఇవ్వడం సరికాదని ఈటల రాజేందర్ పార్టీ నేతల వద్ద వాదిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ మహిళ అయిన తనకే పార్టీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని తుల ఉమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా తానే పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరో వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు విషయంలోనూ వివాదం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఈ సీటు విషయంలో వివాదం మొదలైంది.
ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించాలని లక్ష్మణ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఒక్క రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థికి కూడా టికెట్ కేటాయించకపోవడంపై కొండా మనస్థాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ తీరుపై కొండా అలక వహించినట్లు కాషాయదళంలో చర్చ సాగుతోంది.