NEET Rank List 2024 : దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష (NEET Exam) సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏన్‌టీఏ ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23 న మళ్లీ టెస్ట్ నిర్వహించిన ఎన్టీఏ, వాటి ఫలితాలను కూడా కలిపి ర్యాంకులను విడుదల చేసింది.
మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది హాజరైనట్లు అధికారులు వివరించారు. వారిలో 67మందికి 720కి 720 మార్కులు రావడం వల్ల పెద్ద దుమారమే చెలరేగింది. వారిలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ఉండడం విశేషం. గ్రేస్ మార్కులు కలపడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు మళ్లీ నిర్వహించిన పరీక్షలకు 1563 మందికిగాను 813 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలినవారు గ్రేస్ మార్కులు లేకుండా ర్యాంకులు పొందేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది.