నీట్ పీజీ సీట్(Neet PG Seat) సాధించాలంటే ఇప్పటి వరకు విద్యార్థులకు కత్తి మీద సాములా ఉండేది. ఇక నుంచి అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నీట్ లో సున్నా మార్కులు వచ్చినా కూడా పీజీ సీటు పొందేందుకు అర్హులే అంటుంది కేంద్ర ఆరోగ్యశాఖ. ఈ ఏడాది పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక మీదుట అన్ని కేటగిరీలకు ఈ '' జీరో'' కటాఫ్(Zero Cutoff) వర్తించనున్నట్లు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి నీట్ రాసిన వారికి సున్నా మార్కులు వచ్చినా సరే కౌన్సిలింగ్ కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కూడా కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చని తెలిపింది.
ఇప్పటి వరకు నీట్ కు రెండు కౌన్సిలింగ్ లు కాగా మూడో రౌండ్ కు ఇంకా 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వివరించింది. కేంద్రం ప్రకటించిన ఈ తాజా నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కూడా కౌన్సిలింగ్ అర్హత సాధించినట్లు అయ్యింది.
దీనికి సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందు వరకు కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 800 మార్కులకు గానూ కటాఫ్ మార్కులే 291 గా ఉన్నాయి, ఇక ఎస్సీ-ఎస్టీ-బీసీ అభ్యర్థులకు అయితే కటాఫ్ మార్క్ 257 గా ఉండగా..దివ్యాంగులకు 274 గా ఉన్నాయి. ఈ నిర్ణయంతో అన్ని కేటగిరీలకు కటాఫ్ మార్కులు 'సున్నా'గా మారాయి.
మూడో కౌన్సిలింగ్ కు హాజరు కానున్న వారికి ఈ జీరో కటాఫ్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడో కౌన్సిలింగ్ కు సంబంధిచిన రిజిస్ట్రేషన్, వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్ పీజీ పరీక్షకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.