NEET Exam : అది 2017 సెప్టెంబర్ 1, ప్రాంతం తమిళనాడు-కుజుమూర్..! 12వ తరగతిలో 1200 మార్కులకు 1176 మార్కులు తెచ్చుకున్న పేద దళిత కుటుంబానికి చెందిన అనిత ఉరేసుకోని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఇంత మెరిట్ స్టూడెంట్ ఆత్మహత్యకు నీట్ (NEET) పరీక్షా విధానమే కారణమని తమిళనాడు (Tamilnadu) అట్టుడికిపోయింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న అనిత కలను నీట్ పరీక్ష చిదిమేసింది. ఇలాంటి అనిత కథలు దేశంలోని అనేక గ్రామాల నుంచి వినిపిస్తాయి.. మనల్ని కలిచివేస్తాయి. 2024 నీట్ ఎగ్జామ్ వివాదాల సుడిగుండంలో చిక్కుకోని ఉంది. ఓవైపు ఎగ్జామ్‌ను రీకండెక్ట్ చేయాలన్న డిమాండ్.. మరోవైపు అసలు నీట్ పరీక్షనే రద్దుచేయాలన్న ఆందోళనలతో దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంతకీ ఏంటీ నీట్ వివాదం.? ఈ పరీక్షను అనేక రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
NEET Exam Controversy : 2024 మే 5న నీట్ పరీక్ష జరిగింది. 23 లక్షల మందికిపైగా ఈ ఎగ్జామ్ రాశారు. అయితే ఈ పరీక్ష రిజల్ట్స్‌ను చెప్పినదాని కంటే పది రోజుల ముందుగానే రిలీజ్ చేశారు. జూన్ 4న ఓవైపు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎన్నికల ఫలితాల కోసం టీవీలకు అత్తుకుపోయిన రోజు హడావుడిగా.. అసలు ముందస్తు సమాచారం లేకుండా నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 67మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఒకే ఎగ్జామ్ హాల్‌లో ఉన్న ఒకే వరుసలో కూర్చున్న ఏడుగురు ఈ జాబితాలో ఉండడం అనేక అనుమానాలకు కారణమైంది.
అటు నెగిటివ్ మార్కింగ్ ఉన్నా పలు విద్యార్థులకు మాత్రం 719, 718 మార్కులు రావడం గందరగోళానికి దారి తీసింది. ఒక ప్రశ్న తప్పుగా రాస్తే ఒక నెగిటివ్ మార్క్‌తో పాటు ఓవరాల్‌గా ఐదు మార్కులు తక్కువ రావాల్సి ఉంటుంది. అంటే అన్ని సమాధానాలు కరెక్ట్‌గా రాసి ఒకటి తప్పుగా రాస్తే 720కి 715 మార్కులు రావాలి. ఒకవేళ అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 716 మార్కులు రావాలి.. ఇలా కాకుండా 718, 719 మార్కులు వచ్చాయి. అయితే ఇవి గ్రేస్ మార్కులట. నీట్ పరీక్ష నిర్వహించే NTA-నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టుకు ఇదే సమాధానం చెప్పింది.
Also Read : గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
కొందరికి పరీక్షా సమయం తగ్గడం లాంటి కారణాలను వివరిస్తూ గ్రేస్ మార్కులు కలపినట్టుగా NTA చెప్పింది. అయితే ఇలా గ్రేస్ మార్కులు కలపుతున్నట్టు పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణలో సీరియస్ అయ్యింది. ఇక తర్వాత చేసేదేమీ లేక గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి రీ-ఎగ్జామ్ పెడతామని NTA కోర్టుకు చెప్పింది.
ఇదంతా జాతీయ స్థాయిలో జరిగే ఓ ఎగ్జామ్ గురించి 2024లో జరిగిన పరిణామాలు. ఇలాంటి వివాదాలు నీట్ పుట్టుక నుంచే ఉన్నాయి. ప్రతీ ఏడాది నీట్ పరీక్ష అనేక వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఒక పరీక్షా సెట్‌కు బదులు మరో సెట్ ఇవ్వడం, ఒక మీడియం విద్యార్థులకు ఇంకో మీడియం పేపర్లు ఇవ్వడం లాంటి ప్రతీ ఏడాది జరిగే విషయలే.
2013 నుంచి నీట్ పరీక్షను నిర్వహిస్తోంది కేంద్రం. జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఎందుకంటే నీట్ పరీక్ష NCERT సిలబస్ బెస్ చేసుకునే జరిగే ఎగ్జామ్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు స్టేట్ సిలబస్‌లోనే స్కూల్‌లో చదువుతారు. అటు ప్రతీరాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉంటాయి. గతంలో ఏపీ, తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ప్రకారం మెడికల్ కాలేజీల్లో సీట్లు తెచ్చుకునేవారు విద్యార్థులు. అయితే ఇలాంటి విషయాలను కన్సిడర్ చేయకుండా కేంద్రం ఇష్టారీతిన నీట్ పరీక్షను తప్పనిసరి చేసిందన్న విమర్శలు వినిపిస్తుంటాయి.
NEET Exam Controversy : నీట్ పరీక్ష కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ డాక్టర్లు కాలేకపోతున్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు కేటీఆర్ లాంటి నేతలు సైతం ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అటు తమిళనాడు ఏకంగా నీట్ పరీక్షను తమ రాష్ట్రంలో జరగబోనివ్వమని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాలు సైతం పలు సందర్భాల్లో నీట్ పరీక్షా విధానాన్ని తప్పుబట్టాయి. నీట్ పరీక్ష ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్ సహా అనే రాష్ట్రాలు నీట్ పరీక్షను వ్యతిరేకించాయి. 2011లో గుజరాత్‌కు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కూడా నీట్ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇలా చాలా రాష్ట్రాల నేతలు మొదటి నుంచి నీట్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
మొత్తంగా చూసుకుంటే, NEET పరీక్ష విధానం ఎక్కువ మందికి గందరగోళంగానే ఉంది. అలానే ఈ పరీక్ష పట్లే తీవ్ర వ్యతిరేకత చాలావరకూ ఉంది. ఇన్ని వివాదాల నేపథ్యంలో .. విద్యార్థుల జీవితాలు పణంగా పెట్టి ఇలా నీట్ పరీక్షా విధానాన్ని కొనసాగించడం కరెక్టేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.