బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ కష్టాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు బయటకు తీసి వెళ్లాలంటేనే బెంగళూరు వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అర కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ బెంగళూరు వాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరులో రైలు పట్టాలపై ఆగిపోవడం, పక్కనే రైల్వే గేటు వద్ద వాహనాలన్నీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో బెంగళూరు ట్రాఫిక్‌కు రైలు కూడా ఆగిపోవాల్సిందే అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం గురించి ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించింది. రైలు ఆగడానికి కారణం ట్రాఫిక్ కాదని వివరణ ఇచ్చింది. బెంగళూరు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో మున్నెకోలల రైల్వే గేట్ వద్ద ఇటీవల ఒక రైలు ఆగి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ రైల్వే గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో గేట్‌కు అడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి మరోసారి తీవ్ర చర్చకు తెరలేసింది. అయితే ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు ట్రాఫిక్ జామ్ కారణంగా రైలు పట్టాలపై ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. రైలులో ఏదో శబ్ధం రావడంతో భద్రతాపరమైన తనిఖీల కోసం లోకో పైలెట్ ఆ రైలును ఆ ట్రాక్ మీద నిలిపివేసినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత రైల్వే సిబ్బంది వచ్చి.. రైలును తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి సమస్య లేదని గుర్తించినట్లు చెప్పారు. రైలును తనిఖీల కోసం ఆపడంతో అక్కడ ఉన్న గేట్‌మెన్.. గేటును ఓపెన్ చేసి.. వాహనాలు వెళ్లేలా చేసినట్లు ఆయన వివరించారు.