ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. అక్కడే దొరికిన మూడు బుల్లెట్లు

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ టీంకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటన ప్రాంతంలో మూడు 9 ఎంఎం బుల్లెట్లు దొరికాయి. వీటిలో రెండు లైవ్‌ కాట్రిడ్జ్‌లు కాగా, ఒకటి ఖాళీ షెల్‌గా గుర్తించారు.

New Update
9mm cartridge

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ టీంకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటన ప్రాంతంలో మూడు 9 ఎంఎం బుల్లెట్లు దొరికాయి. వీటిలో రెండు లైవ్‌ కాట్రిడ్జ్‌లు కాగా, ఒకటి ఖాళీ షెల్‌గా గుర్తించారు. పౌరుల వినియోగం కోసం నిషేధించబడిన ఈ కాట్రిడ్జ్‌ల ఉనికి, కేసు దర్యాప్తును కొత్త మలుపు తిప్పుతోంది. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పేలుడు జరిగిన స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఈ మూడు కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 9 ఎంఎం బులెట్లు భద్రతా దళాలు లేదా స్పెషల్ పర్మిషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే వినియోగిస్తారు. సాధారణ పౌరులు వీటిని ఉపయోగించడంపై కఠినమైన నిషేధం అమలులో ఉంది.

సంఘటన స్థలంలో నిషేధిత తుపాకీ బుల్లెట్లు దొరకడం భద్రతా సంస్థలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అవి అక్కడికి ఎలా వచ్చాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇది ఉగ్రకుట్రలో భాగమా? లేదా కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఎవరైనా కావాలనే అక్కడి పడేసి వెళ్లారా? నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ వద్ద ఇవి ఉన్నాయా? దర్యాప్తు అధికారులు ఈ కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ బుల్లెట్లు దొరికినప్పటికీ, సంఘటన స్థలంలో ఏ విధమైన పిస్టల్ లేదా ఆయుధం మాత్రం లభించలేదు అని పోలీసులు స్పష్టం చేశారు. కర్తవ్యంపై ఉన్న తమ సిబ్బందికి కేటాయించిన బుల్లెట్లు కూడా పోలేదని నిర్ధారించారు.

మరింత సమాచారాన్ని రాబట్టడానికి, పోలీసులు ఈ బుల్లెట్ల షల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. పేలుడుకు దాదాపు 30-40 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురు డాక్టర్లు, ఇతరులను పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నిషేధిత కాట్రిడ్జ్‌ల మూలాన్ని తెలుసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు