Naini Coal Block :  వివాదాల నైనీ..అబాసుపాలైన సింగరేణి

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన ఒడిశాలో నైనీ బొగ్గు గని వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెట్టి  నైనీ గనిని ప్రారంభించింది

New Update
FotoJet - 2026-01-23T115950.453

Naini Coal Block

SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన ఒడిశాలో నైనీ బొగ్గు గని వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది.136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెట్టి  నైనీ గనిని ప్రారంభించింది. ఈ గని ప్రారంభం ద్వారా సింగరేణి కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)ను గందరగోళంలో పడేసింది. తెలంగాణ విద్యుత్ రంగానికి బొగ్గును పొందేందుకు కీలకమైన ప్రాజెక్టుగా భావించిన నైని, 2025లో పరిమిత మైనింగ్ ప్రారంభించే ముందు అటవీ అనుమతుల తీసుకోని కారణంగా సంవత్సరాల తరబడి జాప్యాన్ని ఎదుర్కొంది. విధానపరమైన నిర్ణయాల ఆరోపణల మధ్య నైనీ బొగ్గు బ్లాకులో అధిక విలువ కలిగిన టెండర్లను రద్దు చేయడం , సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL )ను దాని చరిత్రలో అత్యంత తీవ్రమైన వివాదాల్లో ఒకటిగా మార్చింది.

నైనీ ప్రస్థానమిది..

ఒడిశాలోని అంగూల్‌ జిల్లాలో ఉన్న నైనీ కోల్‌బ్లాక్‌ను 2015లో సింగరేణి సంస్థ దక్కించుకున్నది. తెలంగాణ వెలుపల సింగరేణి విద్యుత్ అవసరాలకు బొగ్గును సేకరించే ప్రయత్నంగా ప్రారంభమైన ఈ ప్రయత్నం తొలి దశలోనే వివాదాల మయమైంది.ఈ బ్లాక్‌ 2200 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 200 ఎకరాల్లో ఓవర్‌ బర్డెన్‌ (ఓబీ) తొలగింపు టెండర్లను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకున్నది. సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. మిగతా 2 వేల ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ (ఎండీఆర్‌) విధానంలో గతంలోనే టెండర్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 29 వరకు దాఖలుకు అవకాశం ఉన్నది. ఇక్కడి బొగ్గును రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థర్మల్‌ పవర్‌ప్లాంట్‌(ఎస్టీపీపీ)కు తరలించాలి.

 భౌగోళికంగా, నైనీ హై-గ్రేడ్ థర్మల్ బొగ్గు కలిగి ఉన్న ఓపెన్‌కాస్ట్ నిక్షేపం. సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల (MTPA) గరిష్ట ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించబడింది. ఈ బ్లాక్ 912.79 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, అందులో దాదాపు 783 హెక్టార్లు అటవీ భూమి. భౌగోళిక నిల్వలు 440-455 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడ్డాయి, 379 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, దాదాపు 341 మిలియన్ టన్నుల వెలికితీత నిల్వలు ఉన్నాయి.

ఆలస్యమైన అనుమతులు

2015 లో కేటాయింపు జరిగినప్పటికీ, నైని చాలా సంవత్సరాలుగా ఉత్పత్తి ప్రారంభించలేదు. ఎందుకంటే లీజు ప్రాంతంలో 85% కంటే ఎక్కువ అటవీ భూమి ఉండటమే కారణం. అటవీ అనుమతులు ఆలస్యం కావడంతో గని ప్రారంభం ఆలస్యమైంది.2021లో స్టేజ్-I అటవీ అనుమతి, పర్యావరణ అనుమతులు వచ్చాయి, ఆ తర్వాత మార్చి 2023లో స్టేజ్-II (షరతులతో కూడిన) అటవీ అనుమతి లభించింది. జూలై 2024లో 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగించడానికి ఆమోదం లభించి, ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం నుండి అనుమతి లభించడంతో ఈ నిర్ణయాత్మక పురోగతి వచ్చింది. మైనింగ్ ప్రణాళికలు, భూగర్భ జలాల తొలగింపు మరియు కాలుష్య నియంత్రణ ఆమోదాలు కూడా అమలులోకి రావడంతో, ఈ ప్రాజెక్ట్ చివరకు కార్యాచరణకు అనుకూలంగా మారింది.

పరిమిత ఉత్పత్తితో మైనింగ్

SCCL అధికారికంగా ఏప్రిల్ 16, 2025న నైనీలో మైనింగ్ ప్రారంభించింది, ఉత్పత్తి కార్యకలాపాలు చాలా నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించలేదు. ప్రారంభంలో SCCL సొంత యంత్రాలను ఉపయోగించి ఓవర్‌బర్డెన్ తొలగింపు, ప్రాథమిక తవ్వకాలను కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ఉత్పత్తిని 2.5 MTPAగా అంచనా వేయబడింది, ఇది గని గరిష్ట సామర్థ్యం కంటే చాలా తక్కువ. STPP రాంప్-అప్ దశలో తెలంగాణ గనుల నుండి బ్రిడ్జ్‌ లింకేజీలపై ఆధారపడి బొగ్గును తరలించాల్సి రావడంతో  జూలై 2025 నుండి బొగ్గు పంపిణీ ప్రారంభం అవుతుందని భావించారు. నైనీ నుంచి జైపూర్‌కు రైలు మార్గం లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తే గిట్టుబాటు కాకపోవడంతో బొగ్గు గుట్టలుగా పేరుకుపోయింది. నైనీ నుంచి ఇప్పటివరకు సింగరేణికి కిలో బొగ్గు చేరకపోయినా కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నట్టు చెప్తున్నారు.

అవుట్‌సోర్సింగ్ అనివార్యం

ఇక్కడ గని ప్రారంభించే దశలోనే సింగరేణి సంస్థ  నైనీని తన సొంత అంతర్గత వనరుల ద్వారా అభివృద్ధి చేయలేమని అంగీకరించింది. దీనికి అనేక కారణాలుండగా  గని విస్తరణ, విస్తారమైన లీజు ప్రాంతం కలిగి ఉండటం, లోతైన తవ్వకాలు అవసరం పడటం, లోతైన ప్రాంతాలు, అధిక స్ట్రిప్పింగ్ నిష్పత్తి ముఖ్యమైనవి. దీని ఫలితంగా SCCL మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (MDO) మోడల్‌ను ఎంచుకుంది, దీని ప్రకారం గని అభివృద్ధి, ఆపరేటర్ విధానాన్ని ఎంచుకుంది. దీన్ని అనుసరించి తవ్వకం, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, బొగ్గు నిర్వహణ ,పునరుద్ధరణ పనులను ప్రైవేటువారికి ఇవ్వాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం 25 సంవత్సరాలలో రూ.1,604 కోట్లుగా అంచనా వేయబడింది. అధికారులు తెలిపిన ప్రకారం, ఉత్పత్తిని 2.5 MTPA నుండి ప్రణాళికాబద్ధమైన 10 MTPAకి పెంచడంలో అవుట్‌సోర్సింగ్ కీలకమని నిర్ణయించారు.

దుమారం రేపిన టెండర్లు

ఒప్పందం ప్రకారం 2025 చివరలో, నైని బ్లాక్ కోసం MDOలను నియమించడానికి SCCL టెండర్లను పిలిచింది. అక్కడే వివాదం మొదలైంది. తప్పనిసరి ప్రీ-బిడ్ సైట్ సందర్శన మరియు ధృవీకరణ నిబంధనపై అనేక మంది బిడ్డర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల ధృవీకరణ అసాధారణమైన విషయమని, ఇది  విస్తృత భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరిచిందని ఆయా కంపెనీలు వాదించాయి. టెండర్లకు పేలవమైన ప్రతిస్పందన రావడం,  అంచనా వేసిన రేట్లు రాకపోవడం,  పరిశ్రమ నిబంధనలు ఎక్కువగా ఉన్నాయని, బొగ్గు ఒప్పందాలు సాధారణంగా అంచనా వ్యయం కంటే తక్కువ బిడ్లను ఆకర్షిస్తాయని కూడా ఫిర్యాదులు వచ్చాయి. 

రాజకీయ జోక్యం

ఇక డిసెంబర్ 2025 నాటికి, టెండర్ల సమస్య రాజకీయ తుఫానుగా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలోని వర్గాల మధ్య వ్యాపార యుద్ధం జరుగుతుందనే నివేదికలతో, సీనియర్ కాంగ్రెస్ నాయకుల బంధువులు స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి, మంత్రులు ఒక్కొక్కరు వేర్వేరు కంపెనీలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.తాజాగా విడుదలైన మట్టి ఎత్తిపోసే పనులతో (ఓబీ వర్క్‌)పాటు బొగ్గు తోడే పనులకు (ఎక్స్‌కవేషన్‌) సంబంధించిన టెండర్లను తమవారికి ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యనేత, కీలక మంత్రి తమ అస్మదీయులకే కాంట్రాక్టు దక్కాలని మొండిపట్టు పట్టినట్టు తెలిసింది. ముఖ్యనేత సన్నిహితుడి కంపెనీకి గతంలోనే ఒక సింగరేణి టెండర్‌ దక్కిందని, అధిక లాభాలు వచ్చే నైని గని టెండర్‌ కూడా ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఒక ముఖ్యనేత మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనం రావటంతో ఇక టెండర్‌ ఎవరికీ దక్కవద్దనే ఉద్దేశంతో పూర్తిగా టెండర్లను రద్దుచేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మూడు ముక్కలాట రచ్చ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది.

టెండర్ల రద్దు

ఈ వివాదం వెనుక అధికార పక్షానికి చెందిన కొందరు మంత్రుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు కావాల్సిన కంపెనీలకే టెండర్ దక్కేలా నిబంధనలను అడ్డం పెట్టుకుని ఇతరులను పోటీ నుంచి తప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మరియు కొన్ని సంస్థలు గళమెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగంలోకి దిగి పారదర్శకత కోసం సదరు టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన బొగ్గు సరఫరాలో జాప్యం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. సింగరేణికి కేటాయించిన బ్లాకుల్లో తవ్వకాలు జరపకుండా కాలయాపన చేస్తే లేదా అక్రమాలకు పాల్పడితే, ఆ గనులను వెనక్కి తీసుకోవడమే కాకుండా సింగరేణి నిర్వహణను కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం మధ్య ఈ నైనీ బ్లాక్ ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. ఈ వివాదం త్వరగా సమసి పోకపోతే సింగరేణి ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు బొగ్గు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

విచారణ ప్రారంభం

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలతో టెండర్ల రద్దుపై ద్వీసభ్య కమిటీ ఏర్పాటైంది.ఈ కమిటీ టెండర్ల రద్దుపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాగా విచారణకు సంబంధించిన కమిటీ నియామకం  ప్రతులు గురువారం సింగరేణి సంస్థకు చేరిన వెంటనే.. మధ్యాహ్నానికల్లా కమిటీ సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చి విచారణ ప్రారంభించడం సంచలనంగా మారింది. అంతేకాక విచారణ నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గుశాఖ ఆదేశించడంతో ఆగమేఘాలపై కమిటీ సభ్యులు హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఉన్న సింగరేణి కార్యాలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు