6లక్షల మంది జనం.. 85 ఎకరాల స్థలం.. ఆ మధ్యలో నడుచుకుంటూ సింహంలా వచ్చాడు తమిళ స్టార్ విజయ్! తమిళ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విజయ్ పార్టీ మొదటి బహిరంగ సభ గూస్‌బంప్స్ తెప్పించింది. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపన తర్వాత మొదటి సారిగా విజయ్ నిర్వహించిన బహిరంగ సభ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి ఈ సభ టెన్షన్‌ను క్రియేట్ చేసింది.
ప్రతీ మాటలోనూ మెచ్యూరిటీ..
'నేను రాజకీయాల్లో చిన్నపిల్లాడినని కొంతమంది అంటున్నారు... నిజమే. కానీ పామును చిన్న పిల్లలు చేతులతో పట్టుకుంటారు. ఆ పాము అంటే నాకు భయం లేదు. రాజకీయం అంటే సినిమా కాదు, రణరంగం.. ' విజయ్ చెప్పిన ఈ డైలాగ్‌తో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ డైలాగ్‌తో పామును రాజకీయాలతో పోల్చిన విజయ్ ప్రస్తుత పొలిటిక్స్ ఎలా ఉన్నాయో ఒక్క డైలాగ్‌తో చెప్పేశారు. విల్లుపురం జిల్లా విక్రవండిలో జరిగిన ఈ బహిరంగ సభ విజయ్ లెవల్ ఏంటో యావత్ దేశానికి అర్థమయ్యేలా చేసంది. విజయ్ మాట్లాడిన ప్రతీ మాటలోనూ మెచుర్యూటీ కనిపించింది. ఇదే డీఎంకే వెన్నులో వణుకుకు కారణమైంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. 2026లో జరగనున్న ఈ ఎన్నికలకు అధికార డీఎంకే ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే భారీ విజయాలను సాధించింది. ఇక 2026లోనూ విజయఢంకా మోగించడానికి డీఎంకే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో స్టాలిన్ కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి కూడా ఉన్నారు. TVK పార్టీ ఎఫెక్ట్‌తోనే డీఎంకే తన ఎన్నికల సన్నాహాలను ముందస్తుగా ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే తమిళ రాజకీయాల్లో సినీ నటులు రావడం సాధారణమైన విషయమే. MGR, జయలలిత లాంటి వారు రాజకీయాల్లో సూపర్ సక్సెస్ సాధిస్తే కమల హాసన్ లాంటి వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అటు రజనీకాంత్ ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటు విజయ్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది ప్రస్తుతానికైతే చెప్పలేని పరిస్థితి. కానీ పరిస్థితులు మాత్రం విజయ్‌కు అనుకూలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సినీ కెరీర్ పీక్ టైమ్‌లో ఉన్న విజయ్‌కు తన అభిమానులే కొండంత అండ. విజయ్ సామాజిక అంశాలతో కూడిన సినిమాలు ఎక్కువగా చేయడం కూడా ఆయన పొలిటికల్ కెరీర్‌కు ప్లస్‌గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ లాంటి ఇతర పెద్ద నటులు రాజకీయంగా ముద్ర వేయలేదని డీఎంకే వర్గాలు విజయ్ టార్గెట్‌గా మాటల దాడి చేస్తున్నాయి. విజయ్ పార్టీ TVK ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు డీఎంకే ఇలాంటి మాటల దాడి చేస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీఎంకేది మేకపోతు గాంభీర్యమని విజయ్ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.