/rtv/media/media_files/2026/02/01/womens-in-budget-2026-02-01-19-15-46.jpg)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా, గ్రామీణ మహిళల నుంచి నగరాల్లో చదువుకునే విద్యార్థినుల వరకు అందరికీ మేలు చేకూరేలా విప్లవాత్మక పథకాలను ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రధానంగా తయారీ, ఎగుమతులు, అభివృద్ధి అనే మూడు స్తంభాలపై ఆధారపడి రూపొందించబడింది.
ఉమెన్ హాస్టళ్లు
ఉన్నత విద్యను అభ్యసించే బాలికల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ చదివే విద్యార్థినుల కోసం వీటిని నిర్మిస్తారు. లాంగ్ టైం ప్రిపరేషన్, ల్యాబ్ సమయాల్లో బాలికలకు సురక్షితమైన వసతి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. వీటిని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేదా ప్రత్యక్ష మూలధన మద్దతుతో నిర్మిస్తారు. దీనివల్ల గ్రామీణ తల్లిదండ్రులు తమ కుమార్తెలను నగరాలకు పంపి చదివించడం మరింత సులభతరం అవుతుంది.
'షీ మార్ట్స్'
స్వయం సహాయక బృందాల ద్వారా ఉత్పత్తులను తయారు చేసే మహిళల కోసం "షీ మార్ట్స్" (స్వయం సహాయ వ్యవస్థాపక మార్ట్స్) ప్రారంభించనున్నారు. ఇవి క్లస్టర్ స్థాయి సమాఖ్యలలో కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్‌లెట్‌లుగా పనిచేస్తాయి. మహిళలు కేవలం రుణాలు తీసుకునే స్థాయి నుంచి సొంత వ్యాపార యజమానులుగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. మహిళలకు సులభంగా ఫైనాన్సింగ్, వృద్ధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేకంగా 'షీ-మార్క్' బ్యాడ్జ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఆరోగ్య రంగం
మహిళల ఆరోగ్యం, ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 17 కొత్త క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చు భారీగా తగ్గుతుంది. సుమారు 1,50,000 మందికి నైపుణ్యం కలిగిన సంరక్షకులుగా శిక్షణ ఇవ్వనున్నారు. NSQF ప్రోగ్రామ్‌ల ద్వారా యోగా, వెల్నెస్, వైద్య పరికరాల నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఈ రంగంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నందున, వారికి కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయి.
Follow Us