'జగ్గీ వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి, జీవితంలో బాగా స్థిరపడేలా చేశారు.. కానీ, ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు..' ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి! ఇండియాలో గాడ్‌మ్యాన్ స్టెటస్ అనుభవిస్తున్న జగ్గీ వాసుదేవ్‌కు కోర్టు చేసిన కామెంట్స్ పెద్ద షాక్‌గానే చెప్పాలి. ఇద్దరు మహిళలను నిర్భందించారనే వాదనలు, నేరారోపణలపై విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి జగ్గీ వాసుదేవ్‌కు వివాదాలు కొత్త కాదు. ఆయన భార్య మరణం ఇప్పటికీ మిస్టరీనే. అటు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఇషా ఫౌండేషన్ బిల్డింగులు నిర్మించిందన్న ప్రచారం కూడా ఉంది. అటు ఇషా ఫౌండేషన్‌లో మహిళలు మిస్ అయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులే కోర్టుకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.
2022 జూన్‌లో జగ్గీవాసుదేవ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. 'సేవ్ సాయిల్' అనే పేరుతో 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల యాత్ర చేసి ఇండియాకు తిరిగొచ్చిన జగ్గీ వాసుదేవ్ బీబీసీ రిపోర్టర్ శుభగుణం అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇషా ఫౌండేషన్ పని చేస్తోందని చెబుతున్న మీరు.. పర్యావరణ అనుమతులు లేకుండానే ఫౌండేషన్ బిల్డింగులు నిర్మించినట్లు వినిపిస్తున్న ఆరోపణలపై శుభగుణం వివరణ కోరారు. దీంతో అసహనానికి గురైన జగ్గీ వాసుదేవ్ 'దేశంలో చట్టం ఉంది కదా..' అని విసుగ్గా సమాధానం చెప్పారు. ఇంతలోనే రిపోర్టర్ మరో క్వశ్చన్ వేస్తుంటే.. ష్.. అంటూ చికాకు పడ్డారు.
ఆగురుగురు మహిళలు అదృశ్యం..
ఇషా ఫౌండేషన్ నుంచి 2016 తర్వాత ఆరుగురు అదృశ్యమయ్యారని తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టుకు 2024 ఏప్రిల్‌లో నివేదించారు. గత 2023 మార్చిలో తన సోదరుడు 46 ఏళ్ల గణేశన్ ఇషా ఫౌండేషన్ నుంచి కనిపించకుండా పోయాడంటూ తిరుమలై అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటకొచ్చింది.
యూట్యూబ్ వీడియోలపైనా విమర్శలు..
ఇక ఆయన యూట్యూబ్ వీడియోలపైనా అనేక విమర్శలు వస్తుంటాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తిగా జగ్గీ వాసుదేవ్‌ను కొన్ని వర్గాలు తప్పుపడుతుంటాయి. సుడో సైన్స్‌ను ప్రమోట్ చేస్తూ దాన్ని రియల్ సైన్స్‌గా జగ్గీ వాసుదేవ్ చెప్పుకుంటాడన్న వాదన ఉంది. చంద్రగ్రహణం అంటే భూమి నీడ మాత్రమే చంద్రునిపై పడుతుంది. ఆ సమయంలో ఏం తిన్నా ఏం కాదన్నది సైంటిస్టుల మాట.. అయితే జగ్గీవాసుదేవ్ మాత్రం గ్రహణం సమయంలో ఫుడ్ కలుషితమవుందని వీడియోలో చెప్పడం అప్పట్లో వివాదానికి కారణమైంది.
సద్గురు భార్య మరణంపై సందేహాలు
అటు జగ్గీ వాసుదేవ్ భార్య మరణం విషయంలోనూ అనేక సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. జగ్గీ వాసుదేవ్ భార్య విజి 1997లో జనవరి 23న మరణించారు. తన భార్య మరణాన్ని మహాసమాధిగా జగ్గీవాసుదేవ్ చెప్పారు. మహా సమాధి అంటే ఉద్దేశపూర్వకంగా తమకు తాముగా శరీరాన్ని విడిచిపెట్టే చర్య. అయితే ఇండియాలో మహాసమాధి పొందిన వ్యక్తిని ఎవరూ దహనం చేయరు. మహాసమాధి పొందిన వారిని సమాధి చేయడం ఆచారం. కానీ భార్య విజి డెడ్‌బాడీని మాత్రం జగ్గీవాసుదేవ్ దహనం చేయడం అనేక అనుమానాలకు కారణమైంది. ఇక ఆశ్రమంలో భారతీ అనే మహిళతో జగ్గీ వాసుదేవ్ అనుబంధం పట్ల భార్య విజితో ఆయనకు అనేకసార్లు గోడవలు జరిగినట్టుగా అరుంధతీ సుబ్రమణ్యం రాసిన 'సద్గురు: మోర్ దన్ ఎ లైఫ్..' పుస్తకంలో రాసి ఉంది.
ఇక ఇషా ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో చాలా వస్తువులను విక్రయిస్తుంటారు. ఇవి చాలా ఖరీదు చేసేవిగా ఉండడం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. జగ్గీవాసుదేవ్ పాదాల ఫొటో ఫ్రేమ్ 3200 రూపాయలకు ఉండడం తీవ్ర విమర్శలకు కారణమౌతోంది. అటు ఓ రుద్రాక్ష ఖరీదు 10వేల రూపాయలకు పైనే ఉండడం పట్ల కూడా నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసి జీవితాన్ని గడపడానికి యువతులను జగ్గీవాసుదేవ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన రోజే ఈ విషయాలన్ని సోషల్‌మీడియాలో చర్చకు రావడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.