ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్

1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Richard Barlow

1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ప్రణాళికను అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆమోదించకపోవడం "సిగ్గుచేటు" అని ఆయన అన్నారు. 1980లలో పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నండగా సీఐఏలో కౌంటర్-ప్రొలిఫరేషన్ అధికారిగా పనిచేసిన రిచర్డ్ బార్లో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలను వెల్లడించారు.

పాకిస్తాన్ అణ్వస్త్ర శక్తిగా ఎదగకుండా నిరోధించడమే లక్ష్యంగా కహూటా యురేనియం కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి ఓ ముందస్తు దాడికి ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని బార్లో చెప్పారు. ఇందిరా గాంధీ ఈ దాడికి అంగీకరించి ఉంటే బాగుండేదని, ఆమె అలా చేయకపోవడం వల్లే అనేక సమస్యలు పరిష్కారం కాలేదని రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ప్రణాళిక అమలు జరిగి ఉంటే, పాకిస్తాన్ అణ్వస్త్ర వ్యాప్తి జరగకుండా నిరోధించే అవకాశం దక్కి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పరిపాలన ఇలాంటి దాడిని తీవ్రంగా వ్యతిరేకించి ఉండేదని బార్లో తెలిపారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సాగిస్తున్న రహస్య యుద్ధానికి పాకిస్తాన్ సహకారం కీలకం కావడమే దీనికి కారణమని వివరించారు. ఈ అంశాన్ని పాకిస్తాన్ అమెరికాపై ఓ బ్లాక్‌మెయిల్ సాధనంగా వాడుకుందని బార్లో ఆరోపించారు.
చివరికి, ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహూటా కేంద్రం కారణంగానే పాకిస్తాన్ 1998లో అణుపరీక్షలు నిర్వహించి అణ్వస్త్ర దేశంగా అవతరించిందని బార్లో పేర్కొన్నారు. ఈ మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలు అప్పట్లో జరిగిన కీలక నిర్ణయాలపై కొత్త చర్చకు దారితీశాయి.

Advertisment
తాజా కథనాలు