Parliament Sessions : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే తేదీపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు కీలక ప్రకటన చేశారు. నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు ఈ నెల 25న మొదలై డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. కాగా నవంబర్ 26న (రాజ్యంగా దినోత్సవం) పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత జరగనున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవి.
కీలక బిల్లులు...
ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంలో కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వక్ఫ్ బిల్లుకు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే నవంబర్ 29లోగా కమిటీ అధ్యయనం చేసి తాయారు చేసిన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో జేపీసీ పనితీరు వివాదాస్పదమైంది. కాగా ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్షాలు కేంద్రం పై విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే సవరణలతో కూడిన ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.