pahalgam terror attack: రియల్ హీరోకు అవార్డు.. టూరిస్టులను కాపాడి అమరుడై

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన ధైర్య సాహస పురస్కారాలలో ఒక సామాన్య పౌరుడి అసమాన త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన సయీద్ ఆదిల్ హుస్సేన్ షా సాహసగాథపై ప్రత్యేక కథనం:

New Update
_Hussain Shah

దేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన 56 మందికి పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు సయీద్ ఆదిల్ హుస్సేన్ షా. ఓ సామాన్య హార్స్ రైడర్ హుస్సేన్, ఉగ్రవాదుల తూటాలకు ఎదురువెళ్లి పర్యాటకుల ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా నిలిచారు. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పర్యాటకులపై విరుచుకుపడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పర్యాటకులు చెల్లాచెదురుగా పరుగులు తీస్తుండగా, అక్కడ గుర్రపు స్వారీ చేయించే హుస్సేన్ వెనకడుగు వేయలేదు. పర్యాటకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన ఆయన, ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను అడ్డుకున్నాడు.

నిరాయుధుడైన హుస్సేన్, ఒక ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించి వీరోచితంగా పోరాడాడు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన చూపిన ఈ తెగువ వల్ల చాలా మంది పర్యాటకులు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. హుస్సేన్ చేసిన త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవం నాడు ఆయన కుటుంబ సభ్యులకు సాహస పురస్కారంతో పాటు రూ.1 లక్ష నగదు అందజేసింది. గతేడాది జరిగిన ఈ దాడిలో మొత్తం 26 మంది మరణించగా, దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి ఉగ్రవాదులను ఏరివేసింది.

అమరవీరుడికి సలాం

తుపాకీ ముందు నిలబడి ప్రాణ భయం లేకుండా పోరాడిన హుస్సేన్ షా కథ ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లోని ప్రతి ఇంటా చర్చనీయాంశమైంది. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన హుస్సేన్ 'కాశ్మీరీల మానవత్వాన్ని' ప్రపంచానికి చాటిచెప్పారు.

Advertisment
తాజా కథనాలు