Dr. Nori Dattatreyudu: బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్‌కు పద్మ భూషణ్‌

వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయుడు.

New Update
_Dr. Nori Dattatreyudu

Dr. Nori Dattatreyudu

వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలోని ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయుడు, ఆయన ప్రతిభతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో ఎండీ పట్టా పొందారు. ఆ రోజుల్లోనే క్యాన్సర్ మహమ్మారి వల్ల రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి, ఆ వ్యాధిని అంతం చేయాలనే సంకల్పంతో కేవలం 8 డాలర్లతో అమెరికా గడ్డపై అడుగుపెట్టారు.

వైద్య రంగంలో విప్లవం: బ్రాకీ థెరపీ

డాక్టర్ నోరి పేరు వినగానే వైద్య ప్రపంచానికి గుర్తొచ్చేది బ్రాకీ థెరపీ. గతంలో క్యాన్సర్ చికిత్సలో శరీరమంతా రేడియేషన్ ఇచ్చేవారు, దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినేవి. కానీ డాక్టర్ నోరి, రేడియో ధార్మిక పదార్థాలను నేరుగా క్యాన్సర్ కణతి వద్దే ఉంచి చికిత్స చేసే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే బ్రాకీ థెరపీకి ఆయనే ఆద్యుడు. ముఖ్యంగా గర్భాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితులకు ఈ విధానం ఒక వరంలా మారింది. అమెరికాలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా, తన మాతృభూమికి సేవ చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ తగ్గలేదు. హైదరాబాద్‌లోని ఇండో-అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపనలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ఎన్టీఆర్ కోరిక మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆయన సాంకేతిక, వైద్యపరమైన మార్గదర్శకత్వం వహించారు. అమరావతిలో ప్రపంచస్థాయి క్యాన్సర్ ఆసుపత్రికి అంకురార్పణ చేయడంతో పాటు, మారుమూల గ్రామాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి పేదలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వైద్య ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తూ, ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.

ఏఐ సాయంతో క్యాన్సర్ నివారణ

ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) సాయంతో క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను భారత్‌కు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. క్యాన్సర్ అంటే 'మరణశాసనం కాదు' అని నిరూపిస్తూ, అమెరికా అధ్యక్షుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఆత్మీయ వైద్యుడిగా ఆయన అందిస్తున్న సేవలు అనన్యం. 2015లో పద్మశ్రీ అందుకున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఇప్పుడు 2026లో పద్మభూషణ్ అందుకోవడం తెలుగు జాతికి దక్కిన గొప్ప గౌరవం.

Advertisment
తాజా కథనాలు