Organ Donation : మనిషి బతికి ఉన్నంత కాలం అవయవాలు అన్ని కూడా చక్కగా పనిచేయాలి. ఒక్కటి దెబ్బ తిన్న ఆ లోటు లోటే....కానీ గత కొంత కాలం నుంచి ఈ పరిస్థితులు మారాయి. ఇతరులకు సాయం చేసేందుకు వారి అవయవాలను దానం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో మహిళలే ముందు వరుసలో ఉన్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
2023 లో మొత్తం 16,542 అవయవదానాలు జరిగాయి. వీరిలో 15,436 మంది అవయవదానానికి ముందుకు రాగా..అందులో 9,784 మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. బతికుండగానే 15, 436 మంది అవయవదానానికి ముందుకు రాగా...అందులో 9,784 మంది మహిళలతో పాటు 5, 651 మంది పురుషులతో పాటు ఓ ట్రాన్స్ జెండర్ కూడా అవయవదానానికి ముందుకు వచ్చారని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.
బతికున్న వ్యక్తులు సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఒక మూత్రపిండం, కాలేయం ,ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని దానం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆర్గాన్లు అవసరమైనప్పుడు ముందుకు వస్తారు. అంతేకాకుండా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి మరికొన్ని ఇతర అవయవాలు, కణజాలాన్ని వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు దానం ఇవ్వొచ్చు.
2023లో ఇలా బతికున్న వారి నుంచి చనిపోయిన వారి నుంచి తీసుకున్న అవయవాలతో 18,378 అవయవ మార్పిడిలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. చనిపోయిన అవయవదాతల్లో 844 మంది పురుషులు ఉండగా...255 మంది స్త్రీలు ఉన్నారు.
అవయవాల వారీగా చూస్తే గతేడాది అత్యధికంగా 13, 426 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 4, 491 కాలేయం, 221 గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు జరిగినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరణించిన వారి నుంచి సేకరించిన అవయవదానాల్లో తెలంగాణ (252) తొలి స్థానంలో ఉండగా..తమిళనాడు, కర్ణాటక 178 తో తరువాతి స్థానాల్లో నిలిచాయి.
అయితే భారత్ లో సగటున 10 లక్షల మందిలో ఒకరు కూడా ముందుకు రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం అవయవదానం గురించి ప్రస్తావించారు.
Also Read : ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే