/rtv/media/media_files/2025/12/18/indians-renouncing-citizenship-2025-12-18-12-36-54.jpg)
భారతీయుడిగా ఉండడానికి ఇష్టపడిని వారి సంఖ్య క్రమంగా పెరుగుతూపోతుంది. స్వదేశం వద్దు.. విదేశాలే ముద్దు అంటున్నారు ఇండియన్స్. గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఆందోళన రేకెత్తిస్తోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మందికి పైగా భారతీయులు తమ పాస్‌పోర్టులను వెనక్కి ఇచ్చేసి విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నారు. 2011 నుండి ఇప్పటివరకు దాదాపు 18 లక్షల మందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.
🚨 Number of Indians renouncing their citizenship.
— Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2025
2020 - 85,256
2021 - 1,63,370
2022 - 2,25,620
2023 - 2,16,219
2024 - 2,06,378 pic.twitter.com/djVOOmpwsa
అసలు కారణాలివే..
భారతీయులు తమ మాతృభూమిని వదిలి ఇతర దేశాల పౌరసత్వం తీసుకోవడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి..
1. మెరుగైన జీవన ప్రమాణాలు: అభివృద్ధి చెందిన దేశాల్లో లభించే నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, స్వచ్ఛమైన గాలి, మెరుగైన సామాజిక భద్రత ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ భవిష్యత్తు కోసం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
2. ఉపాధి, ఆర్థిక అవకాశాలు: ఐటీ, వైద్యం, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణులైన భారతీయులకు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారీ వేతనాలు లభిస్తున్నాయి. అక్కడ స్థిరపడటం వల్ల ఆర్థికంగా వేగంగా ఎదిగే అవకాశం ఉండటం ప్రధాన కారణం.
3. గ్లోబల్ మొబిలిటీ (పాస్‌పోర్ట్ పవర్): భారతీయ పాస్‌పోర్ట్‌తో పోలిస్తే పాశ్చాత్య దేశాల పాస్‌పోర్టులకు అంతర్జాతీయంగా ఎక్కువ విలువ ఉంటుంది. అనేక దేశాలకు 'వీసా రహిత' ప్రయాణ సౌకర్యం లభించడం వల్ల వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ ప్రయాణికులు విదేశీ పౌరసత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
4. ద్వంద్వ పౌరసత్వం లేకపోవడం: భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదు. అంటే, భారతీయుడు మరో దేశ పౌరసత్వం తీసుకుంటే, అతను వెంటనే భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు. దీనివల్ల విదేశాల్లో స్థిరపడిన వారు అక్కడి సౌకర్యాల కోసం భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వస్తోంది.
ఎక్కడికెళ్తున్నారోచ్చ్..
భారతీయులు పౌరసత్వం తీసుకుంటున్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో జర్మనీ వంటి యూరోపియన్ దేశాలకు కూడా వలసలు పెరిగాయి. ప్రభుత్వం దీనిని 'మేధో వలస'(బ్రెయిన్ డ్రెయిన్)గా కాకుండా, గ్లోబల్ ఎక్స్‌పోజర్‌గా అభివర్ణిస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పెట్టుబడులు, రెమిటెన్స్‌ల రూపంలో భారీగా ఆదాయాన్ని తెస్తున్నారని గుర్తు చేస్తోంది. అయినప్పటికీ, దేశంలోనే ప్రతిభావంతులను నిలుపుకోవడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.
Follow Us