/rtv/media/media_files/2026/02/12/naravane-book-controversy-2026-02-12-11-22-38.jpg)
ఇండియన్ ఆర్మీ మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన అటోబయోగ్రఫీ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ పుస్తకానికి సంబంధించి ప్రముఖ ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’కు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నోటీసులు జారీ చేసింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఈ పుస్తకంలో ఉండటంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. జనరల్ నరవణే తన పుస్తకంలో 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల గురించి ప్రస్తావించారు.
చైనా బలగాలతో ఇండియన్ ఆర్మీ అనుసరించిన వ్యూహాలు, క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, సైన్యం మధ్య జరిగిన కమ్యూనికేషన్, అగ్నిపథ్ పథకం అమలుపై ఉన్న అంతర్గత అభిప్రాయాలను ఆయన అందులో పంచుకున్నారు.
డిఫెన్స్ రంగంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు రిటైర్డ్ అయ్యాక రాసే పుస్తకాల్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ పుస్తకంపై రక్షణ శాఖ ఇంకా తుది అనుమతి ఇవ్వకముందే, ఆ బుక్ సాఫ్ట్ కాపీలు మీడియాలో, ఈ కామర్స్ సైట్లలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పుస్తకం అధికారికంగా విడుదల కాకముందే ఆన్లైన్లో దీనిలోని అంశాలు ఎలా అందుబాటులోకి వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెంగ్విన్ సంస్థకు జారీ చేసిన నోటీసులలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
బుక్‌లోని కంటెంట్ లీక్ అవ్వడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది?
ఆన్లైన్ వేదికలపై ఈ పుస్తకం సాఫ్ట్ కాపీలు లేదా సారాంశాలు ఎలా ప్రత్యక్షమయ్యాయి?
పబ్లిషర్ వద్ద ఉన్న సమాచారం భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలేమిటి?
పోలీసుల నోటీసులపై పెంగ్విన్ రాండమ్ హౌస్ స్పందిస్తూ.. తాము ఇప్పటిదాకా ఈ పుస్తకాన్ని ముద్రించలేదని స్పష్టం చేసింది. ఆన్లైన్ వేదికలపై కనిపిస్తున్నవన్నీ అనధికార కాపీలని, అవి తమ సంస్థ నుంచి లీక్ కాలేదని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపింది. మిలిటరీ నిబంధనల ప్రకారం.. మాజీ ఉన్నతాధికారులు తమ సర్వీసులో ఉన్నప్పటి సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. నరవణే పుస్తకంలో చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలు ఉన్నందున, రక్షణ శాఖ దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అనుమతి లభించే వరకు ఈ పుస్తకం అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదు.
Follow Us