No Marriage Big Success:
అందరూ పెళ్ళి చేసుకోవాల్సిందేనా..? చేసుకోకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా.. చేసుకోకుండా ఎవరూ ఉండడంలేదా? పెళ్ళి కేవలం జీవితంలో భాగమే కదా.. మరేందుకీ గోలా.. అదేదో దివ్యకారమైనట్టు ఒకటే నసా.. ఇది చాలా మంది పెళ్ళి కానీ వాళ్లు చెప్పే డైలాగులు. నిజానికి ఇందులో చాలా వరకు నిజమే ఉంది. పెళ్ళి చేసుకోవడమనేది వ్యక్తిగత విషయం.. పెళ్ళి చేసుకోకుండా మన చుట్టూ కనిపించేవారు తక్కువే ఉండొచ్చు కానీ ఓవరాల్‌గా చూస్తే ప్రపంచాన్ని గెలిచిన చాలామందికి పెళ్ళి కాలేదు. రతన్ టాటా అయినా, అబ్దుల్ కలాం అయినా, గానా కోకిల లతా అయినా పెళ్ళి చేసుకోలేదు. ఆఖరికి మాజీ ప్రధాని వాజ్‌పెయి కూడా పెళ్ళి లేకుండానే జీవితాన్ని గడిపారు. అది కూడా ఎంతో ఆనందంగా.. సక్సెస్‌ఫుల్‌గా..! పెళ్ళి చేసుకోకుండా జీవితం అంతా గడిపి ఎక్కువ మంది మనసుల దోచుకున్న ప్రముఖుల వివరాలు తెలుసుకుందాం!
అబ్దుల్ కలాం..
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈయన తెలియని వారు ఎక్కువ మంది ఉండరు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. స్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం(SLV-III) ప్రయోగానికి డైరెక్టర్‌గా పనిచేసారు కలాం. 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ , పద్మ విభూషణ్,భారత రత్నలతో పాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు.
వాజ్‌పేయ్..
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్. భారత రాజకీయాల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు. కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన కాలంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతుడైన వాజ్‌పేయ్ అనర్గళ ఉపన్యాసకుడు. చతురోక్తులతో సమ్మోహితులను చేయగల నేర్పి. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఈయనను కూడా భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది.
లతా మంగేష్కర్..
లతా మంగేష్కర్ 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టారు. లతా దాదాపు 980 సినిమాలకు పాటలు పాడారు. 36కి పైగా భారతీయ, విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె నాలుగు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ రికార్డులోకెక్కారు. 1948 నుంచి 1978 మధ్యాకాలంలో 30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా చరిత్ర సృష్టించారు. దశాబ్దాలు గడిచినా మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. సంగీత సాగరాన్ని మధించిన భారత కోకిల లతా మంగేష్కర్. ఆమె జీవిత ప్రయాణం ఎందరో భావి గాయకులకు ఆచరణీయం, స్ఫూర్తి దాయకం. గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న పురాస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.
రతన్ టాటా..
1937 డిసెంబర్ 28 న ముంబైలో జన్మించారు. పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో ఆయన పుట్టారు. భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ కు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. చనిపోయేంత వరకూ టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా రతన్ టాటా వ్యవహరించారు. టాటా సన్స్ బాధ్యతలు తీసుకోక ముందు టాటా గ్రూప్ కంపెనీ అయి టాటా ఇండస్ట్రీలో అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు. నానో కార్ రతన్ టాటా కలల కార్ అని చెబుతారు ఆయన ఇచ్చిన ఐడియాల ప్రకారమే దానిని తయారు చేశారు. అతి తక్కువ ధరకే లభించిన నానో కార్స్ కొన్నేళ్ళు ఇండియన్ మార్కెట్లో తెగ సేల్స్ అయ్యాయి. తరువాత నానో కార్ ప్రొడక్షన్ ఆపేశారు. అయితే ఇప్పుడు దాని అప్డేటెడ్ వెర్షన్ నానో ఈవీలను మార్కెట్లోకి తీసకురానున్నారని తెలుస్తోంది. దేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు.