/rtv/media/media_files/2026/03/08/nitish-kumar-2026-03-08-14-44-51.jpg)
బిహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిశాంత్ జేడీయూ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. నిశాంత్ ఎంట్రీతో జేడీయూ 'యువ ఆలోచన.. దృఢ సంకల్పం' అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది.
ఈ కార్యక్రమంలో జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా, కేంద్ర మంత్రి లలన్ సింగ్, రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ చౌదరి వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. అయితే, కుమారుడు పార్టీలో చేరుతున్న సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ లేకపోవడం గమనార్హం.
సభ్యత్వం తీసుకున్న అనంతరం నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత 20 ఏళ్లుగా తన తండ్రి రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు చూసి గర్వపడుతున్నానని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. బిట్ మెస్రా నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిశాంత్, తన తండ్రిలాగే విద్యావంతుడు మరియు మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు.
వెనుక పెద్ద వ్యూహమే
నిశాంత్ రాజకీయ ప్రవేశం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఆయన చట్టసభలోకి అడుగుపెడతారని, ఆపై కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 10 తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, అప్పటికే ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసిన నేపథ్యంలో బిహార్ ప్రభుత్వంలో భారీ మార్పులు ఖాయమని జేడీయూ ఎమ్మెల్యే హరినారాయణ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నితీష్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.
Follow Us