పాక్‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో భారీ ర్యాలీలు

ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్‌లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

New Update
pak attack

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌‌లో శుక్రవారం టెర్రర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 170 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌ యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్‌లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయక ముస్లీంలపై జరిగిన ఈ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆగ్నేయ ఇస్లామాబాద్‌లోని తర్లాయ్ కలాన్ ప్రాంతంలో ఉన్న ఖదీజా తుల్ కుబ్రా మసీదు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం నమాజ్ ముగిసిన వెంటనే భక్తులు బయటకు వస్తున్న సమయంలో, ఒక ఆత్మాహుతి బాంబర్ మసీదు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడి భద్రతా సిబ్బంది అతడిని ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకోవడంతో, ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు ధాటికి మసీదు ప్రాంగణం రక్తసిక్తమైంది. పేలుడు తీవ్రతకు మసీదు గోడలు, పైకప్పు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని పిమ్స్, పాలిక్లినిక్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ దారుణానికి తామే కారణమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధికారికంగా ప్రకటించింది. మైనారిటీ షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం అమానుషమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు