/rtv/media/media_files/2025/11/09/car-2025-11-09-10-18-58.jpg)
సినిమాటిక్ ట్విస్ట్‌ను తలపించేలా ఒక అద్భుత సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బ్రెయిన్ హ్యామరేజ్ ఇతర ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు మరణించారని భావించి, అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో అతను ఒక్కసారిగా ఊపిరి పీల్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వివరాల్లోకి వెళితే గదగ-బెటగేరి నివాసి అయిన నారాయణ వన్నాల్ (38) తీవ్ర అనారోగ్యంతో ధార్వాడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా అతని పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన కోలుకునే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా
నారాయణ వన్నాల్ చనిపోయారని భావించిన బంధువులు, అంత్యక్రియలు నిర్వహించేందుకు అతనిని అంబులెన్స్‌లో గదగ్‌కు తీసుకువచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా, మార్గమధ్యంలోనే నారాయణ వన్నాల్ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం బంధువులు గమనించారు. దీంతో ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వెంటనే అతనిని సమీపంలోని బెటగేరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరణం అంచుల వరకు వెళ్లి, అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో తిరిగి ప్రాణం పోసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వైద్య వర్గాల్లో తీవ్ర చర్చ
సంఘటన వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వైద్య నిపుణులు ఈ అసాధారణ పరిస్థితిని లేట్ డిటెక్షన్ ఆఫ్ డెత్ అని లేదా మరణాన్ని ఆలస్యంగా గుర్తించడం అని వివరిస్తున్నారు. సాధారణంగా మనిషి చనిపోయినప్పుడు శరీరం త్వరగా చల్లబడుతుంది. ఈ సందర్భంలో, శరీరం పూర్తిగా చల్లబడకపోవడం, లేదా మృతదేహాన్ని తరలించే సమయంలో జరిగిన శారీరక కదలిక కారణంగా గుండెకు లేదా ప్రధాన రక్తనాళాలకు రక్త ప్రసరణ మళ్లీ ప్రారంభమై ఉండవచ్చు అని వైద్యులు అంచనా వేస్తున్నారు.
Follow Us