చనిపోయిన భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్.. విదేశీ కరెన్సీ కూడా

ఓ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్ బయటపడటం అందర్ని షాక్‌కు గురించేసింది. కేరళలోని అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ బయటపడింది.

New Update
begger

ఓ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్ బయటపడటం అందర్ని షాక్‌కు గురించేసింది. కేరళలోని అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ బయటపడింది. రోడ్డు యాక్సిటెంట్‌లో చనిపోయిన అతడి వద్ద ఉన్న పాత ప్లాస్టిక్ డబ్బాల్లో భారీగా కరెన్సీ నోట్లు పోలీసులు గుర్తించారు.

గత సోమవారం రాత్రి (జనవరి 5) చారుమ్మూడు సెంటర్‌లో ఓ స్కూటర్ ఢీకొనడంతో అనిల్ కిశోర్ అనే యాచకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అతడు తన పేరును అనిల్ కిశోర్‌గా, తనది కాయంకుళం అని ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు. అయితే తలకు తీవ్ర గాయమవ్వడంతో డాక్టర్లు స్పెషలిస్ట్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచించినప్పటికీ, అతడు ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి మాయమయ్యాడు. మరుసటి రోజు మంగళవారం ఉదయం ఓ దుకాణం వరండాలో అతడు శవమై కనిపించాడు.

పోలీసుల తనిఖీలో షాకింగ్ వివరాలు
అతడి మృతదేహం వద్ద ఉన్న పాత సంచులు, ప్లాస్టిక్ డబ్బాలను పోలీసులు నూరనాడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తనిఖీ చేశారు. వాటిని తెరిచి చూసిన పోలీసులకు నోట్ల కట్టలు కనిపించాయి. స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో ఆ నోట్లను లెక్కించగా, మొత్తం రూ.4,52,207 నగదు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం గతంలో రద్దు చేసిన రూ.2000 నోట్లు  అందులో 12 ఉన్నాయి. ఇండియాతోపాటు సౌదీ రియాల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా అతని దగ్గర ఉంది. ఈ డబ్బునంతటినీ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి, సెల్లో టేపులతో గట్టిగా సీల్ చేసి భద్రపరుచుకున్నాడు.

రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ అనిల్ కిశోర్ ఆసుపత్రి నుంచి ఎందుకు పారిపోయాడోనని పోలీసులు ఆరా తీయగా, తన దగ్గర ఉన్న లక్షల రూపాయలు దొంగిలిస్తారనే భయంతోనే అతడు చికిత్సను తిరస్కరించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ గాయాల వల్లే అతడు మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ నగదును పోలీసులు సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు