అంతరిక్షంలో ఇండియా సొంత ఇల్లు.. నేరుగా BAS నుంచి చంద్రుడి మీదకే!

అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్, మరో చారిత్రాత్మక మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. 'గగన్‌యాన్' మిషన్‌తో  భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా, అక్కడ శాశ్వతంగా ఇండియా 'స్పేస్ స్టేషన్'ను ఏర్పాటు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది.

New Update
Bharatiya Antariksh Station

ప్రపంచ అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్, ఇప్పుడు మరో చారిత్రాత్మక మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. 'గగన్‌యాన్' మిషన్‌తో  భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా, అక్కడ శాశ్వతంగా మన దేశపు 'స్పేస్ స్టేషన్'ను ఏర్పాటు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి ప్రయోగించనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది భూమికి సుమారు 400 నుండి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే స్వదేశీ అంతరిక్ష ప్రయోగశాల. ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనాకు చెందిన తియాంగాంగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో చేరబోతోంది.

ఐదు మాడ్యూళ్లతో తయారయ్యే ఈ స్టేషన్‌లో మొదటి మాడ్యూల్ అయిన BAS-01 (బేస్ మాడ్యూల్) ను 2028 నాటికి ప్రయోగించనున్నారు. దీనిని ఇస్రో శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM3 ద్వారా కక్ష్యలోకి పంపుతారు. 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లను ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ పూర్తిస్థాయి స్టేషన్‌ను సిద్ధం చేయాలని ఇస్రో టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ అంతరిక్ష కేంద్రం సుమారు 52 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో 3 నుండి 4 గురు వ్యోమగాములు 15-20 రోజుల పాటు ఉండి పరిశోధనలు చేయవచ్చు.

ఎందుకీ అంతరిక్ష కేంద్రం?

ఈ కేంద్రం ద్వారా భారత్ కేవలం ప్రయోగాలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవులను పంపే ప్రయోగాలకు ఇది ఒక ప్రధాన స్థావరంగా పనిచేస్తుంది. మైక్రో గ్రావిటీలో శాస్త్రీయ పరిశోధనలు, స్పేస్ మెడిసిన్, మెటీరియల్ సైన్స్ వంటి రంగాలలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టులో విదేశాల పార్ట్‌నర్‌షిప్ లేకుండా, కేవలం భారతీయ కంపెనీల సహకారంతోనే దీనిని నిర్మిస్తుండటం విశేషం. దీనికి అవసరమైన డాకింగ్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి సాంకేతికతను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, అంతరిక్షంలో శాశ్వత స్థావరాన్ని కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ సగర్వంగా నిలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు