/rtv/media/media_files/2026/03/03/lunar-eclipse-2026-03-03-18-42-56.jpg)
Lunar Eclipse
Lunar Eclipse : సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం విషయంలో ఒక్కక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. శాస్త్రవేత్తలు సైన్స్ కారణాలు చెబితే, పండితులు పురాణ కథనాలు చెబుతారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా గ్రహణాల సమయంలో కొన్ని విషయాలను పాటిస్తే మనకూ మంచిదే. ఇక గ్రహణాల సమయంలో రోకలిని నిలబెట్టడం అనేది నేటికి సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ (తాంబూలం) లేదా రోలు, లేదా నేలమీద రోకలిని నిలబెడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఆచారం వెనుక కూడా మనకు కొన్ని నమ్మకాలు, మరికొన్ని శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి.
గ్రామీణులు చెప్పే దాన్ని బట్టి గ్రహణ సమయంలో భూమి, చంద్రుడు – సూర్యుడు ఒకే సరళరేఖలోకి వస్తారు. అలా రావడం వల్ల గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో భూమిపై ఉండే అయస్కాంత శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి కారణంగా రోకలి ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబడుతుందని విశ్వసిస్తారు.అయితే గ్రహణాల సమయంలో అలా రోకలిని నిలబెట్టడం వల్ల అది ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి శుభశూచకమని, అక్కడ అంతా మంచే జరుగుతుందని భావిస్తారు.
అయితే పూర్వం గడియారాలు అందుబాటులో లేవు కనుక గ్రహణం పట్టు విడుపులను తెలుసుకోవడానికి ఇలా చేసేవారని పెద్దలు చెబుతారు. గ్రహణం పట్టిన సమయంలో రోకలిని నిలబెట్టడం వల్ల అది నిలబడుతుందని, రోకలి పడిపోవడాన్ని బట్టి గ్రహణం విడిచిందని గుర్తించేందుకు ఇలా నిలబెట్టే వారని పెద్దలు చెబుతున్నారు. కానీ, దీన్ని శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. గ్రహణానికి రోకలి నిలబడటానికి ఎలాంటి సంబంధం లేదని హేతువాదులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. రోకలి కింద భాగం సమాంతరంగా ఉండటం వల్ల దాన్ని నిలబెడితే నిలబడుతుందంటున్నారు. దానిని సరైన కేంద్ర బిందువు వద్ద నిలబెడితే అది గ్రహణం రోజని కాకుండా ఏ రోజైనా నిలబడుతుందనేది హేతువాదులు అంటున్నారు. ఏది ఏమైనా పూర్వం నుంచి వస్తున్న కొన్ని నమ్మకాలను నేటికి పాటించడం గ్రామీణులకే చెల్లింది.
Follow Us