Indian Teacher :రూ. 8 కోట్ల అవార్డు: ప్రపంచాన్ని మెప్పించిన ముంబై టీచర్!

అంకితభావంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ టీచర్ ప్రైజ్'ను కైవసం చేసుకున్నారు.

New Update
dubai

మురికివాడల్లోని రంగుల గోడలే ఆమెకు బ్లాక్ బోర్డులు.. పేద పిల్లల చిరునవ్వులే ఆమెకు స్ఫూర్తి. అంకితభావంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు రూబుల్ నాగి ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ టీచర్ ప్రైజ్'ను కైవసం చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్‌లో ఆమెకు సుమారు 8.3 కోట్ల రూపాయల (1 మిలియన్ డాలర్లు) నగదు పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో నాయకుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

విద్యావంతులుగా మార్చడమే లక్ష్యంగా

రూబుల్ నాగి తన ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా భారతదేశవ్యాప్తంగా దాదాపు 800కు పైగా లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అసలు పాఠశాల మెట్లు ఎక్కని పిల్లలను గుర్తించి, వారిని విద్యావంతులుగా మార్చడమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, మురికివాడల్లోని గోడలపై అక్షరాలు, గణిత సూత్రాలు, సైన్స్ విశేషాలను రంగురంగుల చిత్రాలుగా మలిచి, దృశ్యరూపంలో విద్యను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

వర్కీ ఫౌండేషన్ 2015 నుంచి అందజేస్తున్న ఈ అంతర్జాతీయ అవార్డును అందుకున్న 10వ వ్యక్తిగా రూబుల్ నిలిచారు. గతంలో కెన్యా, పాలస్తీనా, కెనడా వంటి దేశాలకు చెందిన గొప్ప ఉపాధ్యాయులు ఈ గౌరవాన్ని పొందారు. తనకు లభించిన ఈ భారీ పురస్కార మొత్తంతో పేద యువతకు ఉచితంగా వృత్తి విద్యా శిక్షణ అందించే ఒక గొప్ప సంస్థను స్థాపించనున్నట్లు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. నిరుపేదల బతుకుల్లో విద్య ద్వారా వెలుగులు నింపుతున్న రూబుల్ నాగి కృషిని ప్రపంచ దేశాల ప్రతినిధులు కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు